పూంఛ్ ఉగ్రవాదుల కుట్రలో కొత్త కోణాలు
గురువారం జమ్మూకాశ్మీర్‌లో పూంఛ్ జిల్లాలో జవాన్ల వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారించిన అధికారులకు విస్తుపోయే విషయాలు తెలిసాయి.. ఈ ఆపరేషన్ కోసం ముష్కురులు ముందే రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. ఈ ప్రదేశంపై పట్టు సాధించి, బ్లైండ్ స్పాట్‌లో దాడికి తెగబడ్డారు. కొండలపైనుండి కాల్పులు జరిపారు. పూంఛ్ జిల్లాలోని ధేరా కి గాలి, బుప్లియాజ్ మధ్య గల ధత్యార్ మోర్ వద్ద గురువారం మధ్యాహ్నం 3.45 నిముషాలకు ఈ దాడి జరిగింది. సైనిక వాహనం అక్కడికి రాగానే ఈ బ్లైండ్ స్పాట్ వద్ద వేగం తగ్గుతుందని తెలుసుకున్నారు. దీనితో ఈ ప్రదేశంలో ముందే నక్కి ఉన్న ఉగ్రవాదులు వారనుకున్నట్లు వాహనం వేగం తగ్గగానే కొండలపై నుండి కాల్పులు మొదలు పెట్టారు. భద్రతా బలగాలు ఎదురు దాడులకు దిగగానే వారు పారిపోయారు. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. ఈ దాడికి తమదే బాధ్యత అని పాకిస్తాన్‌కు చెందిన లష్కర్ తొయిబా అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్టు ఫ్రంట్ ప్రకటించింది. ఉగ్రవాదుల కోసం పోలీసులు, భద్రతా సిబ్బంది కార్డన్ సెర్చ్ మొదలు పెట్టారు. పోలీసు జాగిలాలను, డ్రోన్లను ఉపయోగించి అన్వేషిస్తున్నారు.