మూడు రాజధానులపై కొత్త బిల్లు : మంత్రి అమర్నాథ్
ఏపీ రాజధాని అమరావతిపై పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహా పాదయాత్ర పేరుతో అమరావతి నుంచి శ్రీకాకుళం వరకు సాగుతున్న పాదయాత్రపై ఆయన స్పందించారు. రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి కొత్త బిల్లుతో వస్తామని ఆయన చెప్పారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లును పెట్టే అవకాశం ఉందన్నారు. మూడు రాజధానులకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ పట్నం, అమరావతి, కర్నూలు రాజధానులను చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన అని మంత్రి స్పష్టం చేశారు. కొంత మంది పాదయాత్ర అంటున్నారని, దాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు హర్షించరని వ్యాఖ్యనించారు.

ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి పైనా మంత్రి అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అమరావతికి చేసిందేమీ లేదని మంత్రి ఆరోపించారు. అమరావతి కోసం గుంటూరు, విజయవాడకు చంద్రబాబు అన్యాయం చేశారన్నారు. చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు. 29 గ్రామాల కోసమే అమరావతి ప్రజలు ఉద్యమం చేస్తున్నారన్నారు. అమరావతి రైతుల పాదయాత్రతో శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లే అవకాశం ఉందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే మాత్రం అందుకు చంద్రబాబే కారణమని మంత్రి అమర్ నాథ్ ఆరోపించారు.హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు వల్లే అయితే తెలంగాణలో టీడీపీ ఎక్కడుందని ప్రశ్నించారు.

