ప్రజల ఆరోగ్య సంరక్షణకు కొత్త భరోసా
ప్రజల ఆరోగ్య సంరక్షణకు కొత్త భరోసా లభించిందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆరోగ్య బీమా ప్రీమియంపై ఇప్పటివరకు అమల్లో ఉన్న 18 శాతం జీఎస్టీని తొలగించిన కేంద్ర నిర్ణయం వల్ల సామాన్య ప్రజలకు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఉచితంగా అమలు చేయబోతున్న ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’ వల్ల కూటమి ప్రభుత్వానికి సంవత్సరానికి సగటున రూ.750 కోట్ల వరకు ఆదా అవుతుందని మంత్రి వెల్లడించారు. జీఎస్టీ కొత్త సంస్కరణల కారణంగా క్యాన్సర్‌తో పాటు అరుదైన ఇతర వ్యాధుల చికిత్సలో ఉపయోగించే 33 రకాల మందులు, సర్జరీ పరికరాల ధరలు తగ్గుతాయని వివరించారు. వ్యాక్సిన్లు, హెచ్ఐవీ, హెపటైటిస్, టీబీ డయాగ్నోస్టిక్ కిట్ల ధరలు కూడా తగ్గాయని తెలిపారు. ఈ నిర్ణయాలు ప్రజలకు ఆర్థికంగా ఉపశమనం కలిగిస్తాయని మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ శాసనసభలో ప్రసంగించిన విషయం గుర్తుచేసిన మంత్రి, ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానానికి ధన్యవాదాలు తెలిపారు.
జీఎస్టీ పన్ను శ్లాబులను తగ్గించే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సాహసోపేతమైందని ప్రశంసించిన ఆయన, దీని వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరట కలుగుతుందని అన్నారు. చిరు వ్యాపారులపై పన్నుల భారాన్ని తొలగిస్తూ వారి ఆర్థిక ప్రగతికి తోడ్పడేలా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న చర్యలు అభినందనీయమని సత్యకుమార్ యాదవ్ తెలిపారు.