నేతాజీ పరాక్రమ్ దివస్..మోదీ కీలక వ్యాఖ్యలు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పరాక్రమ్ దివస్‌ను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దేశ స్వాతంత్య్రం కోసం ఎంతగానో కృషి చేసిన సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని ఆదర్శంగా, వారసత్వంగా తీసుకోవాలంటూ ప్రధాని మోదీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని వివిధ పాఠశాలల విద్యార్థులతో ముచ్చటించారు. నేతాజీ గొప్పతనాన్ని వివరించి, ఆయన అడుగుజాడలలో నడవాలని సూచించారు. నేతాజీ తొలిసారిగా త్రివర్ణపతాకాన్ని ఎగురవేసిన అండమాన్ దీవులకు బోస్ పేరును పెట్టామని, ఇండియా గేట్ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. బోస్ ఎన్నడూ సుఖవంతమైన జీవితంలో లేరని, ఎప్పుడూ స్వరాజ్యమే ఆశయంగా జీవించారన్నారు. దేశ ఐక్యత, సామరస్యాల కోసం పాటు పడాలని, వీటిని విచ్ఛిన్నం చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

