Andhra PradeshHome Page Slider

వైసీపీ కంచుకోటలో ఎమ్మెల్యేల తిరుగుబాటు

• నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ
• నిన్న ఆనం రామనారాయణరెడ్డి, నేడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
• ఫోన్ టాపింగ్ బయటపెడతానంటున్న శ్రీధర్ రెడ్డి
• రాజ్యాంగేతర శక్తుల పెత్తనం అంటూ ఆనం ఘాటు విమర్శలు

ఏపీలోని నెల్లూరు జిల్లాలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగిలినట్లు అవుతుంది. ఇప్పటికే ఆ జిల్లాలో తిరుగుబాటు మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో గత కొంతకాలంగా ఉన్న అసమ్మతి ఒక్కొక్కటిగా బయటపడుతుంది. అయితే నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న వివాద సంఘటనలను సర్దుబాటు చేసేందుకు స్వయంగా అధిష్టాన పెద్దలు గత రెండు రోజులుగా ప్రత్యేక దృష్టి సారించినా… అవి ఫలించలేదు. దీంతో పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెన్నంటే ఉన్న నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు అధికారికంగా చేసిన ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నెల్లూరులో అసలు ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ ఆందోళన అధిష్టానంతో పాటు పార్టీ శ్రేణుల్లోను పెరుగుతుంది.

నిన్న మాజీ మంత్రి వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి పార్టీకి దూరం కాగా ఆ సంఘటన నుంచి వైయస్సార్సీపీ అధిష్టానం బయటపడక ముందే అదే జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీని విడబోతున్నారు. అయితే అందుకు సంబంధించిన వ్యవహారాన్ని సర్దుబాటు చేసి ఆయనను బుజ్జగించేందుకు అధిష్టాన దూతగా మాజీమంత్రి పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసులు రెడ్డి మంగళవారం సాయంత్రం నెల్లూరుకు చేరుకొని ముఖ్య నేతలతో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో చర్చలు జరిపినప్పటికీ అవి ఫలించలేదు. దీంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇన్చార్జిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్‌తో చర్చించి ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా ఫోన్ టాపింగ్ వ్యవహారంపై బాలినేని ఎమ్మెల్యే కోటంరెడ్డి ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు చోటు చేసుకున్నాయి. చర్చల అనంతరం బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందే తెలుగుదేశం పార్టీకి వెళ్లాలని నిర్ణయం తీసుకొని ప్రభుత్వంపై ఫోన్ టాపింగ్ ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ మారే వ్యవహారం సర్దుబాటు కాకపోగా ఫోన్ టాపింగ్ కు సంబంధించి ఏకంగా ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు కట్టుబడి సాక్షాలు భయపెడతానని ప్రకటించడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లు అయింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో విజయం సాధించి తిరుగులేని శక్తిగా నిలిచింది. అయితే ఎన్నికల సమయం దగ్గర పడేకొద్దీ పార్టీలో నెలకొని ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బలమైన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరం అవుతున్నారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం మరో మారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరిలో రాజ్యాంగేతర శక్తులు పెత్తనం చలాయిస్తున్నాయని ప్రజల చేత ఎన్నుకోబడిన తాను రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉన్నప్పటికీ అలా వ్యవహరించడం మంచి విధానం కాదని ప్రభుత్వ తీరుపై ఘాటైన విమర్శలు చేశారు. ఒకవైపు శ్రీధర్ రెడ్డి వ్యవహారం కొత్త మలుపు తిరుగుతుండగా ఆనం రామనారాయణరెడ్డి మరోసారి రంగంలోకి దిగి సంచలన వ్యాఖ్యలు చేయడంతో నెల్లూరు వైయస్సార్సీపీలో కొత్త చర్చ మొదలైంది. అయితే వైఎస్సార్ సీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరులో వివిధ కారణాలతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా దూరమవుతున్నట్టంతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయాల్సిన అధిష్టాన పెద్దలు ఆ దిశగా ఆలోచన చేయకపోవడంతో నెల్లూరు వైయస్సార్సీపీలో మునుపేన్నడు లేనివిధంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.