Home Page SliderNational

జైళ్లో ధ్యానం చేసుకోవాలి.. భగవద్గీత కావాలి- జడ్జిని కోరిన సిసోడియా

సీబీఐ కస్టడీ ముగియడంతో ఈ మధ్యాహ్నం సిసోడియాను ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. సిబిఐ తదుపరి కస్టడీని కోరలేదని, అవసరమైతే తర్వాత కోరవచ్చని ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్, ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఆప్ నేత వైద్య పరీక్షల సమయంలో సూచించిన మందులను తీసుకెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఒక జత కళ్లద్దాలు, డైరీ, పెన్ను, భగవద్గీత కాపీని తీసుకెళ్లడానికి కూడా అనుమతించారు. సిసోడియా తరపు న్యాయవాది కోరినట్లుగా, ధ్యాన గదిలో ఉంచాలనే అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. బెయిల్ దరఖాస్తును శుక్రవారం కోర్టు విచారించనుంది. ఫిబ్రవరి 26న అరెస్టు చేశాక సిసోడియాను ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి పంపారు. అనంతరం కోర్టు కస్టడీని రెండు రోజులు పొడిగించింది. 51 ఏళ్ల సిసోడియా ఈ బెయిల్ పిటిషన్‌లో సిబిఐ అధికారులు తనను అడిగిన ప్రశ్నలను పదే పదే అడుగుతున్నారని, మానసికంగా వేధింపులకు గురిచేశారన్నారు. ఐతే విచారణ సమయంలో సిసోడియా సహకరించలేదని, తప్పించుకున్నారని సీబీఐ పేర్కొంది. అరెస్ట్ తర్వాత బెయిల్ కోసం ఆప్ నాయకుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించి, హైకోర్టును ఆశ్రయించాలని కోరింది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన ఇంతకుముందు నిర్వహించిన 18 మంత్రిత్వ శాఖలను వదులుకున్నారు.