ఎన్డీఏ సమావేశాలు షురూ..
38 చిన్నప్రాంతీయ పార్టీలతో కలిసి ఎన్డీఏ సమావేశం ఏర్పాటు చేయబోతోంది బీజేపీ. ఢిల్లీలోని అశోకా హొటల్‌లో ఈ భేటీ ప్రారంభం కాబోతోంది. ఈ పార్టీలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన జనసేన పార్టీకి మాత్రమే ఆహ్వానం అందింది. దీనితో జనసేన నేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, ప్రధాని మోదీ ఈ భేటీలో ముఖ్య పాత్ర పోషించనున్నారు. తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే మాత్రమే బీజేపీ తర్వాత పెద్ద పార్టీగా కనిపిస్తోంది. కుటుంబ పాలన, అవినీతి ముఖ్య ఎజెండాగా ఈ సమావేశాలు జరుగనున్నాయని ప్రధాని ఇప్పటికే పేర్కొన్నారు. విపక్షాల భేటీ అంతా బూటకం అని, వారిలో నిజమైన ఐక్యత లేదని, కుటుంబ పాలన కోసమే వారు ఐక్యతా రాగాన్ని ఆలపిస్తున్నారని మోదీ మండిపడ్డారు. ఇప్పుడు జరుగనున్న ఈ మీటింగ్‌లో ఎన్డీఏ అనంతర కార్యక్రమాలు, 2024 ఎన్నికల వ్యూహాలు, పొత్తులు చర్చించే అవకాశాలున్నాయి.

