Home Page SliderInternational

ఆస్కార్ అవార్డు బరిలో దుమ్ము రేపనున్న ‘నాటు నాటు’ సాంగ్‌

సినీ పరిశ్రమకు నోబెల్ బహుమతి లాంటి ‘ఆస్కార్’ అవార్డు కోసం ప్రతీ సినీ కళాకారుడూ కలలు కంటారు. ప్రతీ సంవత్సరం ఆస్కార్‌కు ఎన్నో చిత్రాలు నామినేట్ అవుతుంటాయి. వాటితో భారతీయ సినిమాలు కూడా పోటీ పడుతుంటాయి. కానీ భారతీయ సినిమాలు ఎప్పుడూ ఆస్కార్‌కు చిన్నచూపే. కానీ ఈసారి మన తెలుగు సినిమాకు అవార్డు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి నెలలో జరగబోతున్న ఈ అవార్డుల వేడుకలో పోటీకి రానున్న చిత్రాల జాబితాను ఆస్కార్ అకాడమీ ప్రకటించింది.

వీటికి వచ్చే నెలలో నామినేషన్లు ప్రకటిస్తారు. నాలుగు భారతీయ సినిమాలకు కూడా వాటిలో చోటు దక్కింది. 10 విభాగాలకు సంబంధించిన ఈ జాబితాలో నాలుగు విభాగాలలో ఇండియన్ సినిమాలకు స్థానం దక్కింది. వీటిలో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో RRR చిత్రంలోని ‘నాటునాటు’ అంటూ కుర్రకారును ఉర్రూతలూగించిన పాటకు స్థానం దక్కింది. ఇంకా ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీలో ‘లాస్ట్ ఫిల్మ్ షో’, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో ‘ఆల్ దట్ బ్రీత్స్’, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విష్పరర్’ మొదలైన సినిమాలు చోటు దక్కించుకున్నాయి. ఈ షార్ట్ లిస్ట్ లో ఎంపికైన సినిమాలకు జనవరి 12 నుండి 17 వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. దీనిని బట్టి జనవరి 24న ఆస్కార్ నామినేషన్‌కు ఎంపికైన చిత్రాలను ప్రకటిస్తారు. RRR చిత్రానికి వచ్చిన ప్రజాదరణను బట్టి, నాటు నాటు పాటకు లభించిన క్రేజ్‌ను బట్టి మన తెలుగు పాట ఆస్కార్ అవార్డు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.