Home Page SliderInternational

‘ఫ్రాన్స్ నేషనల్ డే’ కి ముఖ్యఅతిథిగా నరేంద్రమోదీ

భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫ్రాన్స్ నేషనల్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానం అందింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నరేంద్రమోదీని ఫ్రాన్స్ నేషనల్ డే పరేడ్‌కు ఆహ్వానించారు. జూలై 13, 14 వ తేదీలలో మోదీ అక్కడ పర్యటించి పారిస్‌లో జరిగే ఫ్రాన్స్ నేషనల్ డే పరేడ్‌లో పాల్గొంటారు. ఐరోపాలోనే అతిపెద్ద సైనిక కవాతును, గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఈ పరేడ్‌లో భారత సైనిక బృందాలు కూడా పాల్గొనబోతున్నాయి. ఈ సందర్భంగా మోదీ గౌరవార్థం అధికారిక, ప్రైవేట్ విందులను ఏర్పాటు చేయనున్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు. అనంతరం ఇరు దేశాల నేతలు వివిధ అంశాలపై చర్చిస్తారు. అనంతరం ఫ్రాన్స్ ప్రధాని, ఇతర సెనెటర్లు, అసెంబ్లీల అధ్యక్షులతో కూడా సమావేశమవుతారు. అక్కడ ప్రవాసభారతీయులు, ఫ్రెంచ్, భారత్ సంస్థల సీఈవోలతో ప్రత్యేక చర్చలు జరుపుతారు. జూలై 15న ఫ్రాన్స్ నుండి బయలుదేరి యూఏఈ చేరుకుంటారు. అక్కడ యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ మహ్మద్ బిన్ జయేద్ ఆల్ నయాన్‌తో చర్చలు జరుపుతారు. ఇంధనం, విద్య, ఆరోగ్యం, ఆహార భద్రత, ఫిన్ టెక్, సాంస్కృతిక విభాగాలలో భాగస్వామ్యం కోసం ఈ చర్చలు తోడ్పడతాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలియజేసింది.