Home Page SliderHoroscope Today

కుప్పం నుంచి ప్రారంభం కానున్న నారా లోకేష్ “యువగళం”

ఏపీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆ పార్టీ అధికారిక షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్ర మార్గంలో వివిధ వర్గాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానున్నది. మొదటి రోజు పాదయాత్ర కుప్పం మున్సిపాల్టీ లక్ష్మీపురంలో 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు పూజా కార్యక్రమం నిర్వహించి కుప్పం పట్టణం వైపుగా యాత్ర ప్రారంభమవుతుంది. బాబు నగర్, పాతపేట మసీదులో ప్రార్థనల నిర్వహించి కుప్పం బస్టాండ్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ శ్రేణులను ఉద్దేశించి లోకేష్ ప్రసంగించనున్నారు.

అక్కడే ఉన్న ఆటో కార్మికులతో మాట్లాడి అక్కడ నుండి పార్టీ కార్యాలయానికి చేరుకొని తేనేటి విందు సేవిస్తారు. అనంతరం పలమనేరు జాతీయ రహదారి గుండా యాత్ర ప్రారంభమవుతుంది. ఏరియా ఆసుపత్రి, తంజామ్మ కొట్టాలు, చిన్న శెట్టిపల్లి,నలగంపల్లి, పీఎస్ వైద్య కళాశాల వరకు యాత్ర కొనసాగుతుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు. మొదటి రోజు సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర లోకేష్ నడవనన్నారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ఉండేలా పాదయాత్ర ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో నిరాశతో ఉన్న నిరుద్యోగ యువత వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు, నిరుద్యోగ యువత తమ సమస్యలు తెలిపేందుకు యవగళం పాదయాత్ర వేదికగా నిలుస్తోందని పార్టీ వర్గాలు తెలిపారు.