Andhra PradeshNews

హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు.. అసెంబ్లీలో రచ్చ

డాక్టర్‌ ఎన్టీయార్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీగా మార్చడంపై ఏపీ అసెంబ్లీలో రచ్చ రచ్చ అయింది. బుధవారం టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్‌ చేసి యూనివర్సిటీ పేరును మార్చే బిల్లును ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లును సభలో ఆరోగ్య శాఖ మంత్రి రజినీ ప్రవేశ పెట్టారు. ఎన్టీయార్‌పై సీఎం జగన్‌కు గౌరవం ఉందని మంత్రి తెలిపారు. అయితే.. 8 మెడికల్‌ కాలేజీలను వైఎస్సార్‌ 11కు చేర్చారని, జగన్‌ 28కు చేర్చారని.. ఆ క్రెడిట్‌ తాము తీసుకోవాలనే ఉద్దేశ్యంతోనే వర్సిటీ పేరును మార్చామని రజినీ చెప్పారు. వైఎస్సార్‌ను తలచుకొని భావోద్వేగానికి గురైన రజినీ ఓ దశలో కంటతడి కూడా పెట్టారు.

టీడీపీ సభ్యుల ఆందోళన..

అయితే.. హెల్త్‌ వర్సిటీ పేరు మార్పుపై అసెంబ్లీలో ఉదయం 9 గంటల నుంచే గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. అదే సమయంలో వర్సిటీ పేరును మార్చొద్దని నినాదాలిస్తూ టీడీపీ సభ్యులు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టారు. ఆ బిల్లు పెట్టినప్పుడు అభిప్రాయం చెప్పాలన్న స్పీకర్‌ సూచనను పట్టించుకోకుండా ‘సీఎం డౌన్‌ డౌన్‌’ అంటూ టీడీపీ సభ్యులు పేపర్లు చించేసి స్పీకర్‌పైకి విసిరేశారు.

టీడీపీ సభ్యులు ఆందోళనను విరమించకపోవడంతో వాళ్లను సభ నుంచి తీసుకెళ్లాలని మార్షల్స్‌ను స్పీకర్‌ ఆదేశించారు. సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ చెప్పలేదని టీడీపీ సభ్యులు వాదించగా.. ‘చల్‌ ఎన్నిసార్లు చదవాలి’ అంటూ స్పీకర్‌ సీతారాం విసుక్కున్నారు. ‘ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వీళ్లను తీసుకెళ్లండి’ అని మార్షల్స్‌ను ఆదేశించారు. దీంతో 13 మంది టీడీపీ సభ్యులను సభ నుంచి మార్షల్స్‌ తీసుకెళ్లారు.