Home Page SliderTelangana

త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి నియామకం

ఢిల్లీ: త్రిపుర, ఒడిశా రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. త్రిపుర కొత్త గవర్నర్‌గా తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి, ఒడిశా గవర్నర్‌గా ఝార్ఖండ్‌ మాజీ సీఎం రఘుబర్ దాస్‌లను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. ఒడిశా నూతన గవర్నర్‌గా నియమితులైన రఘుబర్‌దాస్ 2014 నుండి 2019 వరకు ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పటికే హర్యానా గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయతో కలిపి తెలంగాణ నుండి ఇద్దరు గవర్నర్లుగా ఉన్నట్లయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధ్యక్షునిగా పనిచేసిన కంభంపాటి హరిబాబు మిజోరాంకు గవర్నర్‌గా ఉన్నారు. దీనితో కలిపి తెలుగు రాష్ట్రాల నుండి ముగ్గురు గవర్నర్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.