జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబును నియమించినట్లు జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నాగబాబు మీడియా సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇప్పటి వరకు పార్టీ కోసం ఓ సామాన్య కార్యకర్తగా పనిచేసిన నేను ఇకపై మరింత బాధ్యతతో పనిచేస్తానన్నారు. అయితే 2019 నుంచి జనసేన పార్టీ కోసం పనిచేస్తున్న నన్ను ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. పార్టీలో హోదా కన్నా పని చేయడంపైనే ఎక్కువ దృష్టి పెడతానన్నారు. నేను ఎప్పుడు పార్టీలో ఏ పదవిని ఆశించలేదని .. అయినప్పటికీ పార్టీ అధినేత నిర్ణయాన్ని గౌరవిస్తూ..ఈ పదవి బాధ్యతలు చేపట్టానన్నారు. పార్టీలో పదవి అనేది ఒక హోదా మాత్రమే కాదని..అది ఎన్నో బరువు బాధ్యలతో కూడుకున్నదని నాగబాబు వెల్లడించారు. ఇకపై జనసైనికులు,వీర మహిళలతో కలిసి పార్టీ అభ్యున్నతికి మరింతగా తోడ్పడతానన్నారు. అంతేకాకుండా పార్టీలో అంతర్గతంగా ఉన్న కొన్ని అపార్ధాలను కూడా రూపుమాపాలన్నారు. పవన్ కళ్యాణ్ ఎంతో నీతి,నిజాయితీతో ఈ పార్టీని స్థాపించారన్నారు. కాబట్టే పవన్ కళ్యాణ్ ఎంతో చిత్తశుద్దితో పనిచేస్తున్నారన్నారు. అలాంటి వ్యక్తిని ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఎన్నుకునేలా వారిలో చైతన్యం తీసుకువస్తానని నాగబాబు మీడియాకు వివరించారు.