మైనంపల్లి రాక, మెదక్ బీఆర్ఎస్‌లో కాక!
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ధిక్కరించి, తనకు, కొడుక్కు టికెట్ దక్కించుకున్న నాయకుడు మైనంపల్లి హన్మంతరావు. మెదక్ జిల్లా రాజకీయాల్లో విలక్షణ నాయకుడిగా ఉన్న మైనంపల్లి రాష్ట్ర విభజన తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. అంతకు ముందు మెదక్ నుంచి పోటీ చేసిన టీడీపీ తరుపున ఆయన ఎన్నికయ్యారు. అయితే ప్రస్తుతం మెదక్ నుంచి తనయుడు మైనంపల్లి రోహిత్‌ను ఆయన బరిలో దించారు. బీఆర్ఎస్ పార్టీకి చివరి నిమిషంలో గుడ్‌బై చెప్పిన మైనంపల్లి, మెదక్ నుంచి తనయుడు గెలుపు కేక్ వాక్ అంటున్నారు. మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన పద్మాదేవందర్ రెడ్డిని ఓడించి తీరుతానంటున్నారు మైనంపల్లి రోహిత్. తొలిసారి ఎన్నికల్లోపోటీ చేస్తున్నప్పటికీ… నియోజకవర్గంలో ఉన్న పరిచయాలు, స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలతో విజయం ఖాయమంటున్నారు. మెదక్ జిల్లాలో తమను విభేదించిన మైనంపల్లికి ఝలక్ ఇవ్వాలని సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఫిక్సయ్యారు. అయితే వారికే ఉల్టా పంచ్ ఇస్తానంటున్నారు మైనంపల్లి. ఇక బీజేపీ నుంచి విజయ్ కుమార్ బరిలో నిలిచారు. మెదక్ నియోజకవర్గంలో గతంలో విజయశాంతి సైతం పోటీ చేసి ఓడిపోవడం, ఈసారి తిరిగి ఆమె కాంగ్రెస్ గూటికి చేరుతుండటంతో… హస్తం పార్టీకి ఏ మేరకు అడ్వాంటేజ్ కలుగుతుందో చూడాలి.

మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోలింగ్ బూత్‌లు 274 కాగా పురుష ఓటర్లు 1,02,340 ఉన్నారు. మహిళా ఓటర్లు 1,11,720 ఉండగా నలుగురు ట్రాన్స్ జెండర్లు ఓటు నమోదు చేసుకున్నారు. మొత్తం ఓటర్లు 2,14,064 ఉన్మారు. మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ముదిరాజ్ జనాభా అత్యధికంగా ఉంది. ఈ నియోజకవర్గంలో సుమారు పదిన్నర శాతం వరకు ముదిరాజ్ ఓటర్లుండగా, మాదిగలు సైతం 9 శాతం వరకు ఉన్నారు. మాలలు సైతం ఇక్కడ 9 శాతానికి చేరువలో ఉన్నారు. ఆ తర్వాత ముస్లింలు సైతం సుమారు 7 శాతానికి చేరువగా ఉన్నారు. గౌడలు 6 శాతం, రెడ్డి సామాజికవర్గం 5 శాతానికి పైగా ఉన్నారు. లంబాడాలు ఐదున్నర శాతం ఉండగా, మున్నూరు కాపులు సైతం నాలుగున్నర శాతం ఉన్నారు. పద్మశాలీలు సైతం ఈ నియోజకవర్గంలో 4 నుంచి 5 శాతం మేర ఉన్నారు. గొల్లలు వైశ్యులు నాలుగున్నర శాతం మేర ఉన్నారు. రెండు కులాలు సుమారుగా 9 శాతం జనాభా ఉన్నారు. ఇతర బీసీలు 5 శాతానికి పైగా ఉండగా, బెస్తలు 4 శాతానికి పైగా ఉన్నారు. ఇతర అన్నీ సామాజికవర్గాలు 20 శాతానికి పైగా ఉన్నారు.