మా మామ్మ నాపై ఒత్తిడి తెచ్చేది: నిత్యామీనన్
కుమారి శ్రీమతి సక్సెస్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నటి నిత్యామీనన్.
కుమారి శ్రీమతితో విజయాన్ని అందుకున్నారు నటి నిత్యామీనన్. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌లో 30 ఏళ్లు వయసు వచ్చినా పెళ్లి చేసుకోకుండా, ఆసక్తి లేకుండా యువతి పాత్రలో ఆమె నటించారు. ఈ సిరీస్ సక్సెస్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యామీనన్ తన పెళ్లి గురించి మాట్లాడారు. కుటుంబసభ్యుల నుంచి ప్రస్తుతానికి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. మా మామ్మ బతికి ఉన్నప్పుడు పెళ్లి విషయంలో నాపై ఒత్తిడి తీసుకువచ్చింది. నటిగా నేను ఉన్నానన్న విషయాన్ని కూడా ఆమె లెక్కచేసేది కాదు. నువ్వు ఏం చేస్తున్నావు? జీవితంలో ఏదైనా సాధించావా? పెళ్లి చేసుకోవచ్చు కదా అని తరచూ అడుగుతుండేది. ఆమె కాకుండా వేరే ఎవరూ ఈ విషయంలో నాపై ఒత్తిడి తేలేదు. ముఖ్యంగా నా తల్లిదండ్రులు నాకు స్వేచ్ఛనిచ్చారు. వాళ్లు నా ఇష్టాన్ని గౌరవిస్తారు. అందువల్లే నేను ఈ స్థాయికి రాగలిగాను అని నిత్యామీనన్ చెప్పారు. కుమారి శ్రీమతి విషయానికి వస్తే.. రాజమండ్రి నేపథ్యంలో ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌గా ఇది తెరకెక్కింది. గోమఠేష్ ఉపాధ్యాయి దర్శకుడు. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సిరీస్.. ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది.


 
							 
							