Home Page SliderNews

నా పేరు సావర్కర్ కాదు, క్షమాపణ చెప్పేదే లేదు: రాహుల్

Share with

ప్రధాన ప్రతిపక్ష నేత పార్లమెంటుకు అనర్హత వేటు వేసిన ఒక రోజు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ప్రధాని తన ప్రసంగానికి భయపడుతున్నారని, లండన్‌లో చేసిన వ్యాఖ్యలుగానీ, పరువునష్టం కేసు విచారణ వ్యాఖ్యల విషయంలో గానీ క్షమాపణలు చెప్పేది లేదన్నారు. ప్రధాని కళ్లలో భయం కనిపించిందన్నారు. అందుకే పార్లమెంట్‌లో మాట్లాడకూడదనుకుంటున్నారన్నారు రాహుల్. క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ నేతల వ్యాఖ్యలకు రాహుల్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. నా పేరు సావర్కర్ కాదు.. నేను గాంధీని.. క్షమాపణ చెప్పనన్నారు.

దేశ అంతర్గత వ్యవహారాల్లో అంతర్జాతీయ శక్తుల జోక్యాన్ని తాను కోరినట్లు బీజేపీ చేస్తున్న ఆరోపణలను రాహుల్ ఖండించారు. లండన్ వ్యాఖ్యలపై వచ్చిన ఆరోపణలపై సభా వేదికపై స్పందించేందుకు అనుమతించాలని స్పీకర్‌ను కోరినా.. అనుమతించలేదన్నారు. భారత వ్యతిరేక శక్తులకు సహాయం చేస్తున్నానని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు… వాటిపై స్పందిస్తానని స్పీకర్‌ను కోరినా ఆయన అనుమతించలేదన్నారు. నిజం కోసం పోరాడటం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం తన లక్ష్యాలన్నారు. జీవితాంతం అనర్హుడిగా మార్చినా… జీవితాంతం జైలుకు వెళ్లాల్సి వచ్చినా పోరాటాన్ని ఆపబోనన్నారు రాహుల్ గాంధీ.

ఐతే రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్య ఓబీసీలను అవమానించడమేనంది. పార్లమెంట్ నుంచి అనర్హత వేటు పడిన వ్యక్తి ఒక్క రాహుల్ మాత్రమే కాదని… బీజేపీకి చెందిన ఆరుగురు నేతలపైనా… దేశవ్యాప్తంగా 32 మంది నేతలపై అనర్హత వేటు పడిందని ఆ పార్టీ పేర్కొంది. కర్ణాటకలో ఎన్నికల ప్రయోజనాల కోసం రాహుల్ గాంధీని బలిపశువుగా చూపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు.