Home Page SliderNational

భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగిసింది-సోనియా గాంధీ

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయాల నుండి తన రిటైర్మెంట్ గురించి ప్రస్తావించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన మూడు రోజుల పార్టీ మేధోమథన సమ్మేళనంలో రెండో రోజు 15,000 మంది ప్రతినిధులను ఉద్దేశించి సోనియా ఇలా అన్నారు, “నాకు అత్యంత సంతోషకరమైన విషయం ఏమిటంటే, నా ఇన్నింగ్స్ భారత్ జోడో యాత్రతో ముగియగలగడం. యాత్ర ఒక మలుపు తిప్పింది. భారతదేశ ప్రజలు సామరస్యం, సహనం, సమానత్వాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారని రుజువు చేసింది.”

డాక్టర్ మన్మోహన్ సింగ్ సమర్థ నాయకత్వంతో 2004 & 2009లో మా విజయాలు నాకు వ్యక్తిగత సంతృప్తినిచ్చాయన్నారు సోనియా గాంధీ. భారత్ జోడో యాత్ర, కాంగ్రెస్‌కు ఒక మలుపు అని యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ రాయ్‌పూర్‌లో అన్నారు. కాంగ్రెస్‌కు, దేశం మొత్తానికి సవాలుతో కూడుకున్న సమయం ఇదన్నారు. దేశంలోని ఒక్కో సంస్థను బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ బంధించి నాశనం చేశాయన్నారు. కొంతమంది వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించడం ద్వారా ఆర్థిక నాశనానికి కారణమైందన్నారు సోనియా గాంధీ.

కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశం రాయ్‌పూర్‌లో నిన్న ప్రారంభమైంది. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఇతర ప్రతిపక్ష పార్టీలతో ఎన్నికల పొత్తులతో సహా కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని భావిస్తున్నారు. మద్దతుదారులను కూడగట్టడం, ఓటర్లతో పార్టీకి ఉన్న డిస్‌కనెక్ట్‌ను పరిష్కరించడం లక్ష్యంగా రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర నేపథ్యంలో ఈ ప్లీనరీ జరుగుతోంది. సెషన్ మొదటి రోజు, కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ పార్టీ అత్యున్నత మండలి, వర్కింగ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించకూడదని నిర్ణయించింది. సభ్యులను నామినేట్ చేయడానికి కొత్త పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు అధికారం ఇచ్చింది.