Andhra PradeshHome Page Slider

అన్యాయంగా నా తండ్రిని జైల్లో ఉంచుతున్నారు…లోకేష్ భావోద్వేగం..

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు 43 రోజులుగా ఖైదులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తన తండ్రిని అన్యాయంగా జైల్లో పెట్టారని భావోద్వేగానికి గురయ్యారు తెలుగుదేశం జాతీయ కార్యదర్శి లోకేష్.   ఆయన తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పులు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడిన ప్రజానాయకుడని పేర్కొన్నారు. నేడు టీడీపీ పార్టీ సమావేశంలో నారా లోకేష్ ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పోరాటం చేయకపోతే ఈ పాటికి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముక్కముక్కలు చేసి, అమ్మేసేవాడని మండిపడ్డారు. డబ్బు సంపాదించాలంటే తమకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయని, చంద్రబాబు డబ్బు కోసం రాజకీయాలు చేయలేదన్నారు. 2019లో ఒక్క ఛాన్స్ అని ప్రజలను మోసం చేసి, ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన జగన్ నియంతగా మారి రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌కు ఇతర రాజధానులకు దీటుగా రాజధాని ఉండాలని కలలు కన్నందుకు, ఆ కలను నిజం చేసినందుకు ఆయనను జైల్లో పెట్టారా అని ప్రశ్నించారు. పైగా మా అమ్మపై కూడా కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వాపోయారు. అసెంబ్లీ సాక్షిగా సైకో జగన్ నా తల్లిని అవమానించారని,ఆమెకు సేవా కార్యక్రమాలు తప్ప రాజకీయాలు తెలియదని పేర్కొన్నారు. చంద్రబాబు ఇచ్చిన పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతామని లోకేశ్ వ్యాఖ్యానించారు.