Andhra PradeshHome Page Slider

ఉగాదినాడు ‘దేవునిగడప’కు పోటెత్తిన ముస్లిం భక్తులు

కడపలోని ‘దేవుని గడప’గా పేరుపొందిన వేంకటేశ్వరుని ఆలయానికి ఓ విశిష్ఠత ఉంది. ఇక్కడికి కేవలం హిందువులే కాదు, ముస్లిం భక్తులు కూడా వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. శ్రీవారిని తమ ఇంటి అల్లుడిగా భావిస్తారు ముస్లింలు. వేంకటేశ్వరుని ఇల్లాలు అలిమేలు మంగమ్మను బీబీ నాంచారి అని, ఆమె ముస్లిం రాజుల ఆడపడుచు అని ప్రతీతి. దీనితో ప్రతీ సంవత్సరం ఉగాది పర్వదినాన, కూరగాయలు, పళ్లు, బియ్యం, తినుబండారాలతో ఆలయాన్ని సందర్శించి మొక్కుబడులు చెల్లించుకుంటారు.

బురఖాలు ధరించిన ముస్లిం ఆడపడుచులు కూడా, తమ వారితో కలిసి వచ్చి వెంకయ్యను దర్శించుకుంటారు. ఈ సంప్రదాయం ఈ ఊరిలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతోంది. తరతరాలుగా అక్కడ స్థిరపడిన ముస్లిం కుటుంబాలకు ఆరాధ్యదైవం వేంకటేశ్వర స్వామివారు. లౌకిక దేశంగా పేరుపొందిన భారత విశిష్టతను చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. అన్ని మతాలు, జాతులు మమేకమై ఈ దేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నారనడానికి ఇదే రుజువు.