‘ట్రంప్ పై వ్యాఖ్యలపై చింతిస్తున్నా’..మస్క్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు ఎలాన్ మస్క్ దిగొచ్చి క్షమాపణలు చెప్పారు. బిలియనీర్ ఎలాన్ మస్క్ తాజాగా తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను లక్ష్యంగా చేసుకుని ఇటీవలి కాలంలో సోషల్ మీడియా చేసిన పోస్ట్ లలో కొన్నింటిపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘గత వారం అధ్యక్షుడు గురించి నేను చేసిన కొన్ని పోస్టుల విషయంలో చింతిస్తున్నాను. అవి చాలా దుమారం రేపాయి’ అని మస్క్ ‘ఎక్స్’లో రాశారు. ట్రంప్ పరిపాలనా విభాగం తీసుకువచ్చిన కీలక వ్యయ బిల్లును మస్క్ తీవ్రంగా విమర్శించిన తరువాత వీరిద్దిరి మధ్య వైరం మరింత ముదిరింది. దేశీయ ఎజెండాకు మద్దతునిచ్చే వ్యయ బిల్లుకు సహకరించే రిపబ్లికన్ చట్టసభ సభ్యులపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలని మస్క్ పిలుపునివ్వడం అధ్యక్షుడు ట్రంప్ కి ఆగ్రహం కలిగించింది. ట్రంప్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బడ్జెట్ బిల్లుకు ఓటు వేసే రిపబ్లికన్లపై చర్యకు ప్రయత్నిస్తే, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని తన మాజీ సలహాదారు ఎలాన్ మస్క్ ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తాజాగా మస్క్ పెట్టిన పోస్టుతో ఈ వివాదం సమసిపోయింది.