Home Page SliderNational

సత్తా చాటాడు. బీసీసీఐ నుంచి బంపర్ ఆఫర్ కొట్టాడు..!

లక్ష్యం ముందుగా నిర్దేశించుకుంటే, అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేస్తారు. అలాంటి వారు జీవితాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. ఆదర్శంగా నిలుస్తారు. క్రికెట్, సినిమా ఈ రెండు రంగాలు దేన్నైనా ప్రభావితం చేస్తాయి. ఆ రెండు రంగాల్లో ఉన్నత స్థానంలో నిలవాలని చాలా మంది కలలుగంటారు. కొందరు ఆ కలలను సాకారం చేసుకుంటారు. ఇటీవల కాలంలో క్రికెట్ ప్రేమికులకు ముషీర్ ఖాన్ పేరు బాగా చర్చకు వస్తోంది. అవును 19 ఏళ్ల ముంబై ఆటగాడు, క్రీజులోకి అడుగు పెట్టాడంటే ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా నిలుస్తున్నాడు. మరో సచిన్ వచ్చాడ్రా అనే అంతగా ఆటతీరు కనబర్చుతున్నాడు. ప్రత్యర్థులను చిత్తు చేస్తూ, జట్టుకు విజయాలు అందిస్తున్నాడు.

ఇండియా Aపై ఇండియా B విజయంలోనూ ముషీర్ కారణమన్న భావన ఉంది. ఇండియా B గెలుపులో కీలకంగా మారిన ముషీర్ ఖాన్‌కు బీసీసీఐ సూపర్ అవకాశం ఇచ్చింది. సత్తా చాటుకో, భవిష్యత్ టీమిండియాలో స్థానం దక్కించుకో అంటూ ప్రోత్సహిస్తోంది. తాజాగా ముషీర్ ఖాన్ ఆస్ట్రేలియాతో మూడు ‘నాలుగు రోజుల’ టెస్టులు ఆడనున్న ఇండియా ఎ జట్టుతోపాటుగా, ఆస్ట్రేలియా వెళ్లేందుకు ఛాన్స్ కొట్టేశాడు. రంజీ క్వార్టర్-ఫైనల్‌లో డబుల్ సెంచరీ, ఫైనల్‌లో సెంచరీ సాధించిన ముషీర్, ఇండియా Aపై జరిగిన ఆటలో ఇండియా B తరపున 181 పరుగులతో సత్తా చాటాడు. దులీప్ ట్రోఫీ పర్ఫామెన్స్, ఇరానీ ట్రోఫీలో ప్రతిభ ఆధారంగా ఆస్ట్రేలియా పర్యటన కోసం భారతదేశం A జట్టును ఎంపిక చేస్తారు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రెస్ట్ ఆఫ్ ఇండియా, రంజీ ఛాంపియన్ ముంబై మధ్య ఫోనల్ పోరు జరగనుంది. ఫిట్‌నెస్ సమస్యలు లేకుంటే, ముషీర్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం ఖాయం.

కీలక సమయాల్లో రాణించడం ముషీర్ కు అడ్వాంటేజ్ అన్న భావన బీసీసీఐలో ఉంది. ఓవైపు బ్యాటింగ్, మరోవైపు బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ముషీర్ రాణిస్తున్నాడు.19 ఏళ్ల ముషీర్ ఖాన్ ముంబై తరపున రంజీ ఆటగాడు. 27 డిసెంబర్ 2022న ఫస్ట్-క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ ఆల్ రౌండర్‌. 2024 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌కు భారత U-19 క్రికెట్ జట్టు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించాడు. డిసెంబర్ 2023లో, భారత U-19 యువ జట్టు కోసం 2024 ICC U-19 క్రికెట్ ప్రపంచ కప్ జట్టుకు ఎంపికయ్యాడు. ఖాన్ రెండు సెంచరీలు చేయడం, టోర్నీలో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. మార్చి 2024లో, ముషీర్ రంజీ ట్రోఫీ ఫైనల్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన ముంబై బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.

సెప్టెంబరు 2024లో, బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇండియా Aతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా B తరపున దులీప్ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే ముషీర్ ఖాన్ మూడో ఫస్ట్-క్లాస్ సెంచరీని కొట్టాడు. ముషీర్ 2005లో ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో జన్మించాడు. ముంబై శివారులో పెరిగాడు. బాల్యంలో ఎక్కువ భాగం ఆజాద్ మైదాన్‌లో తండ్రి, కోచ్ నౌషాద్ ఖాన్‌తో గడిపాడు. ముషీర్ ఖాన్, ముంబయి బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు. ఇంగ్లాండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో సర్ఫరాజ్ ఖాన్ దూకుడు అందరినీ ఆకట్టుకుంది.