తనాఖా పెట్టిన బండికి డబ్బులు అడిగినందుకు హత్య
హైదరాబాద్ పంజాగుట్టలో ఐదు రోజుల కింద అదృశ్యమైన వ్యాపారి ఒక గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.ఎల్లారెడ్డిగూడకు చెందిన విష్ణురూపాని గోపీ అండ్ సన్స్ పేరిట కిరాణా దుకాణం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా వీరి కుటుంబం ఉమ్మడిగా ఉంటూ నాలుగైదు చోట్ల హోల్‌సేల్ వ్యాపారం నిర్వహిస్తుంది. గత నెల 29న రాత్రి 10.30 గంటల సమయంలో విష్ణురూపాని ఇంటి నుంచి బయటకు వెళ్తూ 12 గంటల కల్లా వస్తానంటూ కుటుంబసభ్యులకు తెలిపాడు. రెండు రోజులైనా అతడు రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. దీంతో సోదరుడు మహేశ్ రూపాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విష్ణు రూపాని సెల్‌ఫోన్ సిగ్నల్స్ కనిపెట్టి, ఎస్సార్‌నగర్‌లోని బుద్ధనగర్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు బుధవారం ఆ గది వద్దకు వెళ్లగా తాళం వేసి ఉంది. లోపలి నుంచి వాసన రావడంతో అనుమానం వచ్చి తాళం పగులగొట్టి గదిలోకి వెళ్లారు. కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో విష్ణురూపాని మృతదేహం కనిపించింది.వ్యాపారి హత్యకు ఆర్థిక లావాదేవీలు కారణమై ఉంటాయన్నారు. గతంలో గోపీ అండ్ సన్స్ దుకాణంలో రమేశ్ పనిచేశాడు. ఆ సమయంలో విష్ణురూపాని వద్ద తన వాహనం తనఖా ఉంచి అప్పు తీసుకున్నాడు. డబ్బు ఇచ్చి వాహనం తీసుకువెళ్లాలంటూ పలుమార్లు రమేశ్‌కు సూచించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయని తెలిసింది. తరచూ రమేశ్ ఉన్న గదికి వెళ్లే విష్ణురూపాని 29న రాత్రి వెళ్లి మృతి చెందాడు. మృతదేహం ముఖంపై దిండు ఉండటంతో నిందితుడు దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.