సర్వేల ఆధారంగానే మున్సిపల్ టికెట్లు
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. సోమవారం నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, మున్సిపల్ ఎన్నికల్లో కేవలం సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేసి బీ-ఫాంలు ఇస్తామని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుందని, అదే జోరుతో మున్సిపల్ ఎన్నికల్లో కూడా 70 శాతానికి పైగా సీట్లు సాధించి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులే ఓట్ల రూపంలో తమకు విజయాన్ని అందిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
బీజేపీ అనుసరిస్తున్న మత రాజకీయాలపై మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “శ్రీరాముడు ఏమైనా బీజేపీలో సభ్యత్వం తీసుకున్నారా? దేవుడి పేరు మీద ఓట్లు అడిగే హక్కు మీకు ఎవరిచ్చారు?” అని నిలదీశారు. దేవుళ్లు అందరికీ సమానమేనని, రాజకీయ లబ్ధి కోసం హిందూ-ముస్లిం వివాదాలను సృష్టిస్తూ సమాజంలో ప్రశాంతతను దెబ్బతీయడం సరికాదని హితవు పలికారు. దేశంలో వేల ఉద్యోగాలను తొలగించిన ప్రధాని మోడీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ జిల్లా అభివృద్ధికి ఏం చేశారని, పసుపు బోర్డు పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాకు మరో రెండు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేస్తామని, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కూడా త్వరలోనే ఉంటుందని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 80 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, రాబోయే మూడేళ్లలో మిగిలిన 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఫోర్త్ సిటీ నిర్మాణం కూడా వేగవంతం అవుతుందని ఆయన వెల్లడించారు.

