News

ముదిరాజ్ ఆత్మగౌరవ సభ బీజేపీకి వరం

ఆదివారం నాడు ముదిరాజ్ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ముదిరాజ్ ఆత్మగౌరవ సభకు లక్షలాది ముదిరాజులు వచ్చి రాజ్యాధికారం ఏ లక్ష్యంగా “ఓట్లు మావే… సీట్లు మావే” అనే నినాదంతో వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు సవాల్ విసిరారు. అయితే ముదిరాజుల ఓట్లన్నీ ఏ పార్టీకి లబ్ధి చేకూరుతాయో రాబోయే ఎన్నికల ఫలితాల్లో తెలుస్తుంది.

రాష్ట్ర జనాభాలో ముదిరాజ్‌ల ప్రస్థానం

2014 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో ముదిరాజ్‌లు 14% ఉన్నట్లు తెలింది. అంటే రాష్ట్ర జనాభాలో ముదిరాజ్‌‍లు జనాభా 56 లక్షలు. జనాభాలో సింహభాగం. కానీ రాజ్యాధికారానికి వచ్చేసరికి ముదిరాజ్‌లు కింది నుంచి మొదటి వరుసలో ఉన్నారు. దీంతో పాటుగా రాష్ట్రంలో అత్యధిక పేద కుటుంబాలు ఉన్న సామాజిక వర్గం ముదిరాజ్‌లే. విద్య, ఆర్థిక, రాజకీయపరంగా ముదిరాజ్‌లు తరతరాలుగా అణచివేయబడుతున్నారు. రాష్ట్ర యూత్ జనాభాలో ముదిరాజ్ యువతే సింహభాగం. ఇదే ఇప్పుడు ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక పాజిటివ్ అంశంగా మారనున్నది. ఎందుకంటే గత కొంతకాలంగా మనం సోషల్ మీడియాను గమనించినట్లయితే మారుమూల ప్రాంతంలో జరిగిన ముదిరాజ్‌ల నిరసనలను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఒక కూటమిగా ఏర్పడి తమ సమస్యలను అలాగే కొన్ని సంవత్సరాల నుండి పెండింగ్‌లో ఉన్న రిజర్వేషన్ అంశాన్ని ప్రధాన అంశంగా సోషల్ మీడియాలో బాగా రోల్ చేస్తున్నారు. ఇలా ముదిరాజ్ యువత సోషల్ మీడియాలో చురుకుగా తమ తమ నిరసనలను ప్రపంచానికి తెలియజేయడంతో రాష్ట్రంలో ఉన్న ఇతర సామాజిక వర్గాలు కూడా చైతన్యంతో వారికి మద్దతు తెలుపుతూ నిరసనలో పాల్గొంటున్నారు.

ముదిరాజ్‌లను విస్మరించిన కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గత నెలలో ప్రకటించిన 115 నియోజకవర్గాల అభ్యర్థి జాబితాలో ఒక్క ముదిరాజ్ కూడా చోటు దాక్కకపోవడంతో రాష్ట్రంలో ఉన్న ముదిరాజ్‌లు అందరూ బీఆర్ఎస్ పార్టీ పైన, అలాగే కేసీఆర్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. రాష్ట్ర జనాభాలో సింహభాగం ముదిరాజ్‌లే అని తెలిసి కూడా కేసీఆర్ ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడంలో ఒక వ్యూహం ఉందని క్లియర్‌గా అర్థమవుతోంది. రాజకీయాల్లో చాణిక్యుడుగా పేరుందిన కేసీఆర్‌కి ముదిరాజ్‌ల నుండి నష్టం వాటిల్లుతుందని తెలిసి కూడా ఒక్క సీటు కేటాయించకపోవడంలో పెద్ద కుట్ర కోణం దాగి ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద తలకాయలుగా పేరొందిన కేసీఆర్, హరీష్ రావు, రేవంత్ రెడ్డి మొదలగు అగ్రకుల నాయకుల నియోజకవర్గంలో మెజారిటీ ఓట్లు ముదిరాజ్‌లవే. కాబట్టి ముదిరాజ్‌లకు రాజ్యాధికారం లభిస్తే ఈ పెద్ద తలకాయల్లో చలనం ఉండదని గ్రహించి, రాజకీయంగా శాశ్వత బహిష్కరణ చేయాలని నిర్ణయించుకున్నట్లు క్లియర్గా అర్థమవుతోంది.

కేసీఆర్‌కు చుక్కులు చూపిస్తాం

రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలపై బీసీ సమాజ్ సంస్థ జరిపిన లెక్కలు ఏం చెప్తున్నాయిసంగం సూర్యారావు ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన బీసీ సమాజ్ సంస్థ తెలిపిన లెక్కల ప్రకారం 45 నియోజకవర్గాల్లో ముదిరాజ్‌ల ఓట్లు గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అదేవిధంగా దాదాపు 15 నియోజకవర్గాల్లో ముదిరాజ్‌ల ఓట్లు వారికి వారే ఓట్లేసుకున్నా గెలుపు ఏకపక్షమే అవుతుందని పేర్కొంది. ఈటల రాజేందర్ బాటలో ముదిరాజ్‌లు….బీజేపీకి వరం. ఆదివారం నిర్వహించిన ముదిరాజ్ ఆత్మగౌరవ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాష్ట్ర ముదిరాజ్‌లు అందరూ భవిష్యత్ తరాలకు ఒక దిక్సూచి భావించారు. అందులో భాగంగానే కాబోయే సీఎం అంటూ నినాదాలతో పరేడ్ గ్రౌండ్స్‌ను మార్మోగించారు. ముదిరాజ్‌లందరూ ఇష్టంగా పిలుచుకునే సర్కార్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సైతం ఈటల రాజేందర్ బాటలో నడవడానికి సిద్ధంగా ఉన్నట్లు మొన్న షాద్‌నగర్‌లో పండుగ సాయన్న ముదిరాజ్ విగ్రహావిష్కరణలో ప్రకటించాడు. ఇలా రాష్ట్రంలో ఉన్న ముదిరాజ్‌లు అందరూ ఈటల తమ నాయకుడు అంటూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇది బీజేపీకి కచ్చితంగా మేలు చేస్తుంది.

బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి సంతోష్ హంగ్ కామెంట్స్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని, హంగు ఫలితాలే వస్తాయని అప్పుడు బీజేపీ పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ వాక్యాలకు ప్రధాన కారణం రాష్ట్ర జనాభాలో అత్యధికంగా మన ముదురాజ్‌లు అందరూ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు అన్ని సర్వేలు తెలుపుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ముదిరాజ్‌లు అందరూ బీజేపీ పక్షాన నిలిచినట్లయితే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని అన్ని రాజకీయ పార్టీ నాయకులు విశ్లేషించుకుంటున్నారు. భారతదేశ సామాజిక విప్లవ పోరాట సృష్టికర్త జ్యోతిరావు పూలే… ముదిరాజ్ పోరాట స్ఫూర్తితో రాజాధికారం ఏ లక్ష్యంగా “ఓట్లు మావే… సీట్లు మావే” అనే నినాదంతో రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఈటల ద్వారా కాషాయం పార్టీకి వరంగా మారనుంది.

జి కిరణ్ ముదిరాజ్
9848026576