Home Page SliderInternationalTrending Today

“మిసెస్ వరల్డ్” కిరీటం మన భారత సుందరికే

భారతదేశాన్ని మరోసారి అందాల కిరీటం వరించింది. దాదాపు 21 ఏళ్ల తర్వాత మిసెస్ వరల్డ్ పోటీల్లో జమ్ము-కాశ్మీర్‌కు చెందిన సర్గమ్ కౌశల్ విజేతగా గెలుపొందారు. ఈ పోటీలు అమెరికాలోని లాస్‌వేగాస్‌లో జరిగాయి. వివాహిత మహిళల కోసం ఈ అందాల పోటలను 1984 నుండి నిర్వహిస్తున్నారు. పెళ్లి కాని యువతులే కాదు వివాహం జరిగిన తర్వాత, పిల్లలు కలిగినా కూడా భారత మహిళలు అందంలో, ఆత్మ విశ్వాసంలో ఎవరికీ తీసిపోరని మన భారత మహిళలు నిరూపిస్తున్నారు.

మిసెస్ వరల్డ్ కిరీటాన్ని 2001లో భారత్‌కు చెందిన డాక్టర్ అదితీ గోవిత్రికర్ మొదటి సారిగా గెలుచుకున్నారు. ఆమె డాక్టరే కాకుండా మోడల్ , సినీ నటి కూడా. పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాలో హీరోయిన్‌గా నటించారు.

ఈ పోటీలో గత సంవత్సరం గెలుపొందిన విజేత అమెరికాకు చెందిన షాయలిన్ ఫోర్డ్, విజేత సర్గమ్‌కు కిరీటాన్ని అందజేసారు. మొదటి రన్నరప్‌గా మిసెస్ పాలినేషియా, రెండవ రన్నరప్‌గా  మిసెస్ కెనడా నిలిచారు. మిసెస్ ఇండియా పోటీ నిర్వహణ సంస్థ అధికారికంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సర్గమ్ మిసెస్ వరల్డ్‌ గా గెలుపొందినట్లు ధృవీకరించింది. ఆమె మాట్లాడుతూ దాదాపు 21 ఏళ్ల తర్వాత భారత్‌కు ఈ కిరీటం తన కారణంగా దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని ‘లవ్‌యూ భారత్’, ‘లవ్యూ వరల్డ్’ అంటూ హర్షం వ్యక్తం చేశింది. ఆమె ఇంగ్లీష్ లిటరేచర్‌లో పీజీ పూర్తి చేసి, విశాఖపట్నంలో కొంతకాలం టీచర్‌గా కూడా పనిచేశారు. ఆమె భర్త ఆది కౌశల్ భారత నౌకాదళ అధికారి కావడంతో కొన్నాళ్లు విశాఖపట్నంలో ఉన్నారు. ఆమె కాన్సర్  బాధిత పిల్లల కోసం సేవాసంస్థలతో కూడా కలిసి పనిచేస్తున్నారు. ఈ కిరీటం సాధించిన సందర్భంగా సర్గమ్‌ను మాజీ మిసెస్ వరల్డ్ అదితి గోవిత్రికర్ కూడా అభినందించారు. ఈ పోటీల్లో 63 దేశాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు.