భళా హర్‌ప్రీత్ జీ
ఈరోజు టీచర్స్ డే సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పంజాబ్‌లోని బిహ్లా గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హర్‌ప్రీత్‌సింగ్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోబోతున్నారు. ఆయన సాధించిన విజయం ఎంత గొప్పదో తెలుసుకోవలసిందే. ఆయన చేసిన పని గురించి తెలిస్తే ‘ఔరా’ అనక మానరు.

పంజాబ్ లోని బర్నాలా జిల్లాలోని పాఠశాల ఓ శిథిల భవనంలా ఉండేది. హర్‌ప్రీత్ ఆ బడిని సంస్కరించాలని సంకల్పంతో ఆ శిథిల భవనాన్ని ఉద్దరించే పని మొదలు పెట్టారు. గ్రామస్థులు, ఎన్నారైల సహకారంతో ఫండ్స్ సేకరించాడు. తన జీతం నుండి కూడా ప్రతినెలా డబ్బు కూడబెడుతూ మొత్తం 39 లక్షల రూపాయలు ప్రోగుచేశాడు. బిహ్లా బడి రూపురేఖలే మార్చివేసి కొత్త స్మార్ట్ స్కూల్‌గా ఆ బడిని రూపొందించాడు హర్‌ప్రీత్. ఈ రోజు ఆస్కూల్‌లో ఉన్న సౌకర్యాలు ఖరీదైన ప్రవేట్ స్కూళ్లలో కూడా ఉండవు. పంజాబ్‌లోనే మొదటి బాలల శిక్షణాలయ విభాగాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. భాషా ప్రయోగశాల, LED తెరలు, ప్రొజెక్టర్లు, విద్యా కార్యకలాపాల పార్కు మొదలైన వివిధ ఆధునిక సౌకర్యాలతో తన చిరకాల స్వప్నమైన గ్రామీణ విద్యార్థులకు స్మార్ట్ స్కూల్ అందివ్వాలనే ఆశను నెరవేర్చుకున్నాడు. రేపటి పౌరులైన విద్యార్థుల భవితను చక్కదిద్దే ఇలాంటి ఉత్తమ ఉపాధ్యాయులు ఎంతో అభినందనీయులు కదా..
ఈ సంవత్సరం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా 46 మంది అధ్యాపకులు రాష్ట్రపతి అవార్డునందుకోబోతున్నారు. విద్యార్థులకు చదువు చెప్పడమే కాకుండా వారి జీవితాలను మంచిదారిలోకి నడిపి, చక్కదిద్దే ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశం.

