రైలులో ప్రయాణిస్తున్న ఎంపీపై రాళ్ల దాడి
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రయాణిస్తున్న ట్రైన్‌పై రాళ్ల దాడి జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న వందేభారత్ ట్రైన్ బోగీపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో బోగీ అద్దాలు ధ్వంసమయ్యాయి. అహ్మదాబాద్ నుంచి సూరత్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అసదుద్దీన్ ఒవైసీకి ఎలాంటి గాయం కాలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సూరత్‌లో ప్రచారం నిర్వహించేందుకు అసదుద్దీన్ ఒవైసీ అహ్మదాబాద్ నుంచి ట్రైన్‌లో వెళుతున్నారు. సూరత్‌కు 20 నుంచి 25 కిలోమీటర్లు దూరంలో ఈ రాళ్ల దాడి ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఎంఐఎం నేత వారిస్ పఠాన్ ట్వీట్ చేశారు. రైలు అద్దాలు ధ్వంసం అయిన ఫోటోలను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తమపై రాళ్ల వర్షం కురిపించినా, అగ్ని వర్షం కురిపించినా తాము మాత్రం హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామని వారిస్ పఠాన్ తెలిపారు.

