స్ఫూర్థి పథకం గడువును పొడిగించండి
◆ ఈ పథకం ద్వారా లక్షలాది మంది కళాకారులు లబ్ధి
◆ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని క్లస్టర్స్ లో పథకం అమలుపై కళాకారులు ఆందోళన
◆కేంద్ర మంత్రి కి నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు లేఖ
దేశంలో సాంప్రదాయ పరిశ్రమల పునరుత్పత్తి కోసం నిధి అందించే (స్ఫూర్థి)పథకం గడువును పొడిగించాలని, దీని ద్వారా లక్షలాది మంది కళాకారులు లబ్ధి పొందనున్నారని కేంద్ర మంత్రి నారాయన్ తాతు రానే కు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు లేఖ ద్వారా అభ్యర్థించారు. వస్త్రాలు, హస్తకళలు, వెదురు, వ్యవసాయ-ప్రాసెసింగ్, ఖాదీ, కాయిర్ మొదలైన రంగాలు దీని నుండి ఎంతో ప్రయోజనం పొందాయని పేర్కొన్నారు. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాలను కవర్ చేస్తూ 16 క్లస్టర్లు ఆమోదించబడి చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరంలో ఆరు క్లస్టర్లు పని చేస్తున్నాయని తెలిపారు. కృష్ణా, తూర్పుగోదావరి, చిత్తూరు, విజయనగరం, గుంటూరు, విశాఖపట్నం, బాపట్ల, కడపలో మిగిలిన క్లస్టర్లు ఇంకా అమలు దశలోనే ఉన్నాయని పేర్కొన్నారు.

అయితే ఈ పథకం గడువు నవంబర్ 2022లో ముగిసినందున అమలులో ఉన్న క్లస్టర్‌లలోని కళాకారులు దీన్ని కొనసాగిస్తారా లేదా అన్న ఆందోళన చెందుతున్నారని ఈ పథకాన్ని కొనసాగించేందుకు మంత్రివర్గం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు. ముఖ్యంగా గుంటూరు, బాపట్ల, ఇతర జిల్లాల కళాకారులు ఆందోళన చెందుతున్నారని దాదాపు 10,000 మంది హస్తకళాకారులు క్లస్టర్ల ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారని, కానీ అవి అమలు కోసం పెండింగ్‌లోనే ఉన్నాయని వెల్లడించారు. వీటి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలలో ఆమోదించబడిన అన్ని క్లస్టర్‌లు పనిచేసే తేదీ వరకు స్ఫూర్థి పథకాన్ని పొడిగించడాన్ని పరిశీలించి, కళాకారులకు మేలు చేయాలని కేంద్ర మంత్రికి ఎంపీ విన్నవించారు.

