నేడు సిబిఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సిబిఐ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ సిబిఐ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మరోవైపు ఇదే కేసులో అరెస్టైన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ను సిబిఐ కోర్టు డిస్మిస్ చేసింది. ఒకేరోజు ఈ రెండు పరిణామాలతో మళ్ళీ వివేకా హత్యకు సంబంధించి రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ కేసులో ఎంపీ అవినాష్ ను పలుమార్లు విచారించిన సిబిఐ తాజా నోటీసులు జారీ చేయటంతో ఆయన అరెస్టుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాగా నోటీసులు అందుకున్న అవినాష్ రెడ్డి మంగళవారం విచారణకు హాజరుకానున్నారు.

కడపలో ఉన్న అవినాష్ రెడ్డికి వాట్సాప్ ద్వారా నోటీసులు రావడంతో ఆయన సోమవారం హైదరాబాద్ కు తిరిగి పయనం అయ్యారు. ఆయన వెంట పార్టీ నేతలు కొందరు పలువురు అభిమానులు కూడా బయలుదేరారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పై ఇంతవరకు ఎటు తేలలేదు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో మళ్లీ తెలంగాణ హైకోర్టులోనే ముందస్తు పై విచారణ జరగాల్సి ఉన్నందున జూన్ 5కు వాయిదా పడిన విషయం తెలిసిందే.

అరెస్టు చేసి ప్రశ్నిస్తేనే కీలక సమాచారం వెల్లడవుతుందని ఇప్పటికే సిబిఐ అధికారులు కోర్టుకు తెలిపారు. ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకొని హైకోర్టు సిబిఐ దర్యాప్తుకు అడ్డంకి చెప్పలేదు. దీంతో తాజాగా నోటీసులు జారీ చేయడంతో అరెస్టుపై రాజకీయ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. తాజా నోటీసులతో అవినాష్ రెడ్డి ఏడోసారి సిబిఐ ముందుకు రానున్నారు.