బీజేపీలోకి సినీ నటి త్రిష ?
సినీ నటి త్రిష రాజకీయాల్లోకి రాబోతోందా ? ఏ పార్టీలో చేరబోతోంది ? జాతీయ పార్టీయా? ప్రాంతీయ పార్టీయా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు సినీ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ. ఈ వార్త సంచలనంగా మారింది. ఆమె బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని ఓ ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే తమిళనాడులో పాగా వేయాలని భావిస్తున్న కమలనాధులు .. ఈ దిశగా పావులు కదుపుతున్నారు. రజనీకాంత్ కు గవర్నర్ గిరి ఇచ్చే ఆలోచన చేస్తుండగా.. త్రిషను పార్టీలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగమే ఆమె బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం.

సినీ నటులు రాజకీయాల్లోకి రావడం .. ఎమ్మెల్యేలుగా.. ఎంపీలుగా గెలవడం మామూలు విషయమే. ఎంజీఆర్, ఎన్టీయార్, జయలలిత లాంటి వారు సొంతంగా రాజకీయ పార్టీలు స్ధాపించి ఏకంగా ముఖ్యమంత్రులే అయ్యారు. అనేక రాష్ట్రాల్లో మంత్రులుగా ఉన్న వారూ ఉన్నారు. అయితే తమిళనాడు నుండి రాజకీయాలలోకి వచ్చిన నటులు చాలా ఎక్కువ మందే కనిపిస్తారు. వారంతా ఏదో రకంగా సక్సెస్ అయిన వారే. విజయ్ కాంత్, కమల్ హసన్, శివాజీ గణేశన్, , కుష్బు, వైజయంతీమాల తదితరులు ఉన్నారు. ఏపీలో అయితే పవన్ కల్యాణ్, చిరంజీవి,విజయశాంతి, జగ్గయ్య, సత్యనారాయణ, రావు గోపాలరావు ఇలా ఎంతో మంది ఉన్నారు. కథా రచయితగా, మాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేసి.. ఆ తర్వాత రాజకీయాలలో రాణించి ముఖ్యమంత్రి పదవి చేపట్టింది కరుణానిధి మాత్రమే. అనేక పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు. సుదీర్ఘకాలం పాటు రాజకీయాలలో కొనసాగారు.

ఇప్పుడు స్టార్ హీరోయిన్ త్రిష కూడా రాజకీయాల బాట పట్టబోతున్నారు అన్న వార్త ఆసక్తి రేపుతోంది. దక్షిణాది భాషల్లో అనేక సినిమాల్లో నటించి రాణించిన త్రిష.. బిజేపీలో చేరి ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనేక మంది అగ్ర కథానాయకుల సరసన నటించిన త్రిషను కాంగ్రెస్ లో చేరాలని అనేక మంది కోరారు. కానీ.. బిజేపీలో చేరితేనే రాజకీయంగా మంచి భవిష్యత్ ఉంటుదని త్రిష భావిస్తున్నారట. త్రిష రాజకీయ ప్రవేశంపై కోలీవుడ్ లో ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమెను రాజకీయాల్లోకి వెళ్ళాలని హీరో విజయ్ ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. అయితే రాజకీయ రంగ ప్రవేశం చేసేది నిజమా కాదా అన్నది నిర్ధారణ కాలేదు. ఇప్పటి వరకు ఈ విషయంపై త్రిష స్పందించ లేదు. ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ.. అభిమానుల్లో మాత్రం ఆసక్తి నెలకొంది.
