Home Page SliderTelangana

జర్నలిస్ట్ కు సారీ చెప్పిన సినీ నటుడు

జల్ పల్లిలో సినీనటుడు మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తన నివాసం వద్ద జరిగిన ఉద్రిక్తతపై మోహన్ బాబు మరోసారి స్పందించారు. ఆ ఘటనలో గాయపడిన జర్నలిస్ట్ కు క్షమాపణలు చెబుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ మేరకు మీడియా సంస్థకు బహిరంగ లేఖ రాశారు. ‘ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటనను అధికారికంగా ప్రస్తావించడంపై విచారం వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాస్తున్నాను. వ్యక్తిగత కుటుంబ వివాదంగా మొదలై.. ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో జర్నలిస్ట్ సోదరుడికి బాధ కలిగించినందుకు నాకు కూడా బాధగా ఉంది. ఇది జరిగిన తర్వాత అనారోగ్య కారణాల వల్ల 48 గంటలు ఆసుపత్రిలో చేరడం వల్ల వెంటనే స్పందించలేకపోయాను. నేను అతడి సహనాన్ని అభినందిస్తున్నా. ఆరోజు నా ఇంటి గేటు విరిగిపోయి.. దాదాపు 50 మంది వ్యక్తులు ఇంట్లోకి వచ్చారు. దీంతో నేను సహనాన్ని కోల్పోయాను. ఈ గందరగోళం మధ్య మీడియా ప్రతినిధులు అనుకోకుండా వచ్చారు. నేను పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో ఒక జర్నలిస్ట్ కు గాయమైంది. ఇది చాలా దురదృష్టకరం. అతడికి, అతడి కుటుంబానికి కలిగిన బాధకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను. హృదయపూర్వకంగా క్షమించమని కోరుతున్నా. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’ అని లేఖలో మోహన్ బాబు రాసుకొచ్చారు.