సన్ సిటీలో ఘోర ప్రమాదం-కారు ఢీకొని మార్నింగ్ వాక్‌కు వెళ్తున్న తల్లీ కూతుర్లు మృతి
సన్ సిటీలో ఒక ఎర్రటి హోండాసిటీ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకుంటూ వచ్చిన ఆ కారు అనూరాధ, మమత అనే తల్లీ కూతుర్లతో పాటు మరో మహిళను, మరో వ్యక్తిని కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ కూతుర్లు అక్కడికక్కడే మరణించారు. కవిత అనే మరో మహిళకు కూడా తీవ్రమైన గాయాలై ఆసుపత్రి పాలయ్యింది. మరో వ్యక్తికి కూడా తలకు బలమైన గాయాలయ్యాయి. అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. వెనుక నుండి మితిమీరిన వేగంతో వెళ్తున్న ఆ కారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో మార్నింగ్ వాక్‌కు వెళ్తున్న వారి ప్రాణాలను బలిగొంది. అతి దారుణంగా ఫుట్ పాత్‌పై నడుస్తున్న మహిళలను కబళించింది ఈ కారు. కారు డ్రైవర్ యాక్సిడెంట్ చేసిన అనంతరం అతి వేగంగా దగ్గరలోని చెట్లలోకి దూసుకువెళ్లింది. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు గుర్తించారు. ఈ కారులో ఒక బట్టల బ్యాగ్, దానిలో ఒక తల్వార్ కూడా ఉందని పోలీసులు గుర్తించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా అనే విషయంపై కూడా విచారణ చేయవలసి ఉంది. రెండు బృందాలుగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్‌ను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొంటున్నారు.