ఇకపై సులభంగా యూట్యూబ్ ‘మానిటైజేషన్’
యూట్యూబ్ ఛానెల్ క్రియేటర్లకు, కంటెంట్ క్రియేటర్లకు శుభవార్త. ఇకపై యూట్యూబ్ మానిటైజేషన్ చేసుకోవడం చాలా సులభం. మానిటైజేషన్‌కు సంబంధించిన రూల్స్‌ను సరళంగా మార్చారు యూట్యూబ్ యాజమాన్యం. వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఎదురులేని యూట్యూబ్ ఇప్పుడు ‘మానిటైజేషన్’ అర్హతకు కావలసిన సబ్‌స్క్రైబర్ల సంఖ్యను సగం తగ్గించింది. గతంలో 1000 మంది కనీస సబ్‌స్క్రైబర్లు ఉంటేగాని మానిటైజేషన్‌కు అర్హత ఉండేది కాదు. ఇప్పుడు కేవలం 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉంటే సరిపోతుందని నిబంధనలు సడలించింది. దీనితో చిన్న చిన్న ఛానెల్స్, చిన్న క్రియేటర్లు కూడా యూట్యూబ్ ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. గతంలో ఏడాదికి కనీసం 4 వేల గంటల వ్యూస్ లేదా చివరి 90 రోజుల్లో 10 మిలియన్ షార్ట్స్ వీడియో వ్యూస్ ఉండాలి. ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం ఏడాదికి కేవలం 3 వేల గంటల వ్యూస్, లేదా చివరి 90 రోజుల్లో 3 మిలియన్ల్ షార్ట్స్ వీడియో వ్యూస్ ఉంటే చాలు. మానిటైజేషన్‌కు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ కొత్త నిబంధనలు అమెరికా, కెనడా, బ్రిటన్, తైవాన్ లలో తీసుకొస్తున్నారట. అనంతరం భారత్‌కు కూడా ఈ రూల్స్ రావచ్చు.

