తెలంగాణ నుంచి కేబినెట్‌లోకి ఎవరు?
కేంద్ర మంత్రివర్గాన్ని త్వరలో విస్తరించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ నేతృత్వంలో రెండోసారి కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. సాధారణ ఎన్నికలకు దాదాపు మరో ఏడాది గడువు ఉంది. ఈనేపథ్యంలో మరింత మెరుగైన పాలనకు వీలుగా మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. ఈ ఏడాదిలో 9 రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రాలకు పెద్దపీట వేయనుంది మోదీ సర్కార్.

ఈ నెల 29న ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందే కేంద్ర మంత్రివర్గ విస్తరణతో పాటు ఈ ఏడాది ఎన్నికలు జరగాల్సిన కొన్ని రాష్ట్రల్లో పార్టీ అధ్యక్షుల మార్పు కూడా జరగొచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఈ సారి మంత్రివర్గ విస్తరణలో తెలుగు రాష్ట్రాలవారికి చోటుదక్కే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ దూకుడు మీదుంది. ఇదే తరహాలో ముందుకు సాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించవచ్చని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ ఎంపీలకు మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు చూస్తోంది.

అయితే తెలంగాణలో నలుగురు ఎంపీలు ఉన్నారు. వీరిలో జి.కిషన్‌రెడ్డి ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా ఉన్నారు. మరో ముగ్గురిలో తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, అర్వింద్, లక్ష్మణ్, సోయం బాపురావు ఉన్నారు. డాక్టర్ కె లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన బీజేపీ పార్లమెంటరీ బోర్డులోనూ, ఎన్నికల బోర్డులోనూ సభ్యులుగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ తరుణంలో ఒకరికా, లేదంటే ఇద్దరికి కేబినెట్లో చోటు లభిస్తుందా అన్నది చూడాలి. మరోవైపు సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర మాత్రమే ఉండడం, ఇదే చివరి మంత్రివర్గ విస్తరణగా భావిస్తున్నందున ఈసారి ఏపీలో ఒకరికి అవకాశం ఇవ్వవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీకి చెందిన సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అయితే ఇందులో తెలంగాణకు చెందిన ఎంపీలకు మొదటి అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది.