వరద విలయంలో సర్వం కోల్పోయిన మోరంచపల్లి
భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లిలో ఎవరిని కదిలించినా కన్నీటి కథలే. గత వారంలో ఉప్పొంగిన వరద మోరంచపల్లిని పూర్తిగా ముంచెత్తింది వరద. అక్కడ ప్రజలను జీవనాధారం కోల్పోయేలా చేసింది. పాడిపశువులతో సంతృప్తిగా ఉన్న అక్కడి ప్రజలు అనుకోకుండా అరగంటలో వరద ముంచెత్తడంతో ఏమీ పాలుపోని స్థితిలో పడ్డారు. వారి ఇళ్లు, రోడ్లు, పొలాలు పూర్తిగా పాడయిపోయాయి. వారికి పాల ఉత్పత్తే జీవనాధారం. వారికి పశువులను కట్లు ఇప్పే సమయం కూడా లేకుండా పోయింది. దీనితో వరద ముంచేసిన సమయంలో వందల సంఖ్యలో ఆవులు, బర్రెలు చనిపోయాయి. కొన్ని వరదలో కొట్టుకుపోయాయి. వారి ఇళ్లు సర్వనాశనమయ్యాయి. ఈ సమయంలో ప్రాణాలు దక్కితే చాలనట్లు ఇళ్లపై ఎక్కి కూర్చున్నారు. ప్రభుత్వం బోట్లు, హెలికాఫ్టర్లు ఏర్పాటు చేయడంతో వీరు ప్రాణాలతో బయటపడ్డారు. వరద నీరు తగ్గాక తిరిగి ఊరు చేరినవారికి నాశనమైపోయిన రోడ్లు, ఇళ్లు, చనిపోయిన వారి పశువులు దర్శనమిచ్చాయి. దీనితో వారు కన్నీరుమున్నీరయ్యారు. ఇసుక మేటల కింద బైక్‌లు, కార్లు, పశువుల శవాలు కనిపించాయి. దాతలు సహాయం చేయాలని, వారినిఆదుకోవాలని కన్నీళ్లతో వేడుకుంటున్నారు.