International

విలువ కట్టలేని వానరస్నేహం -కడదాకా తోడొచ్చిన వైనం

శ్రీలంక మనసర్కార్

జంతువులను అల్ప జీవులని చిన్నచూపు చూడకండి. విశ్వాస ఘాతకులైన మనుషుల కంటే చాలా సందర్భాలలో అవే మానవత్వంతో వ్యవహరిస్తాయి. పెంచి పోషించిన తల్లిదండ్రులనే కడతేర్చేవారున్నారు. ఇలాంటి సమాజంలో తనకు రోజూ అన్నం పెట్టిన వ్యక్తి చనిపోయినందుకు రోదిస్తోంది ఓ వానరం. అతనికి ముద్దు పెట్టి, లేపడానికి ప్రయత్ని స్తున్న దృశ్యాలు అక్కడున్న అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బట్టికలోవ అనే జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఒక కోతికి రోజూ అన్నం పెట్టేవాడు. అది కూడా అతనితో సరదాగా ఆడుకొనేది. అయితే పాపం అతడు ఈ నెల 18న మరణించాడు. రోజూలాగే ఇంటికి వచ్చిన ఆ కోతికి అతను కనబడలేదు. అయితే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న కుటుంబసభ్యులు దానిని అతని మృతదేహం వద్దకు తీసుకెళ్లారు. అతడు చనిపోయాడని తెలియక తట్టిలేపడం, కంటతడి పెడుతూ అతడికి ముద్దు పెట్టడం అక్కడున్న అందరి హృదయాలనూ ద్రవింపజేసింది. స్నేహానికి మూగజీవులు కూడా అతీతులు కారని ఈ సంఘటన నిరూపించింది.