NationalNews

దక్షిణాది రాష్ట్రాలపై మోదీ ఫోకస్

ప్రారంభోత్సవాల్లో ముఖ్య అతిధిగా ప్రధాని పాల్గొంటున్నారు. తాజాగా బెంగళూరు-చెన్నై మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ రైల్వేలను పూర్తిగా ఆధునీకరిస్తున్నామన్నారు. వందే భారత్ ట్రైన్ కేవలం రైలు మాత్రమే కాదని… యువత ఆకాంక్షలకు నిదర్శనమన్నారు. బెంగళూరు స్టార్టప్ హబ్‌గా దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. కర్నాటక ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. దేశంలో రైల్వే స్టేషన్లన్నింటినీ హైటెక్ స్టేషన్లుగా మార్చుతామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.

బీజేపీ, పలు రాష్ట్రాల్లో అధికార పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల్లో నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యట జరుపుతున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ₹ 25,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల కంటే తక్కువ సమయం ఉన్నందున ప్రధాని పర్యటన ప్రాముఖ్యతను సంతరించుకుంది. అనేక రాష్ట్రాల్లో కేంద్రం నియమించిన గవర్నర్‌లు, పాలక పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న తరుణంలో మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకొంది. తన పర్యటన “భారతదేశ వృద్ధి పథాన్ని బలోపేతం చేయడం” లక్ష్యంగా ఉందన్నారు. దక్షిణ భారతదేశం నుండి ప్రారంభమైన కాంగ్రెస్, భారత్ జోడో యాత్ర, దాదాపు రెండు నెలలుగా పెద్ద సంఖ్యలో జనాలను ఆకర్షిస్తున్న తరుణంలో మోదీ సౌత్ పై ఫోకస్ పెంచారు. “రాబోయే 2 రోజులలో, భారతదేశ వృద్ధి పథాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో విభిన్న కార్యక్రమాలలో పాల్గొనేందుకు దక్షిణాదిలోని 4 రాష్ట్రాలు- కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో పర్యటిస్తానన్నారు.

బెంగుళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న KSR రైల్వే స్టేషన్‌లో దక్షిణ భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ రైలు, చెన్నై-మైసూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. బెంగళూరులోని విధానసౌధలో కవి కనకదాసు, వాల్మీకి మహర్షి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2ను ప్రారంభించిన మోదీ విమానాశ్రయంలో 108 అడుగుల నాడప్రభు కెంపేగౌడ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఇక మధ్యాహ్నం నుంచి తమిళనాడును ప్రధాని సందర్శించాల్సి ఉంది. తమిళనాడులో ఎంత ప్రయత్నిస్తున్నా బీజేపీ అనుకున్నట్టుగా అడుగులు వేయలేకపోతోంది. ప్రధానమంత్రి శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ₹ 10,500 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఆ రోజు తరువాత, తెలంగాణలోని రామగుండంలో ₹ 9,500 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు, ప్రధాని మోదీ, బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా భావసారూప్యత కలిగిన పార్టీల మహా కూటమిని కలపడానికి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో, డీఎంకే ప్రభుత్వం ద్రావిడ ప్రజలపై హిందీని రుద్దే ప్రయత్నం, వివాదాస్పదమైన నీట్ మినహాయింపు బిల్లుతో సహా అనేక సమస్యలపై కేంద్రంతో విభేదిస్తోంది. కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర యుద్ధం సాగుతోంది. మూడు రాష్ట్రాల్లోని గవర్నర్‌లు కీలకమైన చట్టాల విషయంలో హోరాహోరీ సాగుతోంది. గవర్నర్లు… కేంద్రం కీలుబొమ్మలా” వ్యవహరిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. శక్తులను ఏకీకృతం చేసి, అధికార బీజేపీని ఎదుర్కోవడానికి ప్రాంతీయ పార్టీలు పార్టీల దూకుడు పెంచుతున్న తరుణంలో మోదీ సౌత్ టూర్ ప్రాధాన్యత సంతరించుకొంది.