పచ్చకామెర్లు సోకినోడి సామెతను’ తలపిస్తున్న మోడీ తీరు
విజయవాడ :ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రశంసలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని మోడీ తీరు ‘పచ్చకామెర్లు సోకినోడి సామెతను’ తలపిస్తోందని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అనేక సమస్యలు మోడీకి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తూ, ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌లో రైతులు అవస్థలు పడుతున్నా, ఆ కష్టాలు మోడీకి కనిపించడం లేదని షర్మిల ప్రశ్నించారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు పంటలను తగలబెడుతున్న దృశ్యాలు, తుఫాన్ల ధాటికి సర్వం కోల్పోయినప్పుడు ఆదుకోలేని ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రధానికి కనిపించదు అని ఆమె ఎద్దేవా చేశారు.
వివిధ సంక్షేమ పథకాలు, హామీల అమలుపై కూడా వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు చేశారు. “వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థుల మరణమృదంగం కనిపించదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించక విద్యార్థులు పడుతున్న కష్టాలు కనిపించవు. ఆరోగ్య శ్రీ ఆపితే రోగులు పడుతున్న రోదన కనపడదు. సూపర్ సిక్స్ హామీల పేరిట చేస్తున్న మోసాలు, వేస్తున్న కత్తెరలు కనిపించవు” అంటూ కూటమి పాలనలోని లోపాలను ఆమె ఎత్తిచూపారు.
రాష్ట్రంలో కూటమి పాలన భేష్ అని మోడీకి అనిపించడానికి కారణం కూటమి పార్టీల వైఖరే అని షర్మిల ధ్వజమెత్తారు. “ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను, విభజన హామీలను మీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి, తల ఊపమంటే ఊపే గొర్రెల్లా కూటమి పార్టీలు మారాయి కాబట్టే, మోడీకి రాష్ట్రంలో కూటమి పాలన భేష్ అనిపిస్తోంది. సమన్వయంతో పని చేస్తున్నట్లు కనిపిస్తోంది” అని ఆమె ఘాటుగా విమర్శించారు. ప్రధాని హోదాలో ఉండి అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రాన నిజాలు మరుగున పడవని షర్మిల హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానిది అసమర్థ పాలన అని, ఆర్భాటాలు, హంగామా తప్పా ఆచరణలో హామీల అమలు శూన్యమని, అభివృద్ధికి ఆమడ దూరమని ఆమె వ్యాఖ్యానించారు. చివరగా, రాష్ట్ర ప్రజలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే, విభజన హామీలను అమలు చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాలని, ఢిల్లీని మించిన రాజధానిగా అమరావతికి నిధులు ఇవ్వాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

