Home Page SliderNational

మోడీజీ, ఆదరణీయ వంటి పదాలతో నన్ను పిలవద్దు: పీఎం

న్యూఢిల్లీ: మోడీజీ, ఆదరణీయ వంటి గౌరవ సూచకమైన పదాలను ఉపయోగించి తనను ఇబ్బంది పెట్టవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ ఎంపీలను కోరారు. గురువారం నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ఇంత పెద్ద బీజేపీ పార్టీలో తాను కూడా ఓ చిన్న కార్యకర్తనని అన్నారు. అయితే తనను పిలిచే క్రమంలో పేరు ముందు, పేరు వెనక గౌరవ సూచక పదాలు పెట్టొద్దని అన్నారు. దేశ ప్రజల దృష్టిలో తాను వారి కుటుంబ సభ్యుల్లో ఒకరినని పేర్కొన్నారు. గౌరవ పదాలు వాడినట్లయితే దేశ ప్రజలకు తనకు మధ్య దూరం పెంచినట్లు అవుతుందని చెప్పారు. ఇక ఇటీవల మూడు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంలో.. బృందంగా అందరి సమిష్టి కృషి ఉందని మోడీ అభిప్రాయపడ్డారు.