InternationalNews

మోదీ-జిన్‌పింగ్‌.. దగ్గరగా నిలుచున్నా.. దూరంగానే..!

ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఒకే వేదికపై ఉన్నా.. దూరం, దూరంగా కనిపించారు. పక్కపక్కనే నిలబడి ఫొటో దిగినా.. ఒకరినొకరు పలకరించుకోలేదు.. షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకోలేదు.. కనీసం చూసి నవ్వుకోనూ లేదు.. ఈ ఘటన శుక్రవారం ఉబ్జెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌ నగరంలో జరిగింది. షాంఘై సహకార సంఘం (షాంఘై కో-ఆపరేటివ్‌ ఆర్గనైజేషన్‌-ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ అరుదైన ఘటన జరిగింది. ఈ సదస్సులో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తదితర దేశాధినేతలు పాల్గొన్నారు.

గ్రూప్‌ ఫొటోలో పక్కపక్కనే..

గాల్వాన్‌ వ్యాలీలోని భారత్‌, చైనా సరిహద్దుల్లో రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత ఇరు దేశాధినేతలు ఒకే వేదికపై కలవడం ఇదే తొలిసారి. జిన్‌పింగ్‌తో మోదీ దూరం దూరంగా మెలిగారు. వేదికపై గ్రూప్‌ ఫొటో దిగిన సమయంలో ఇద్దరూ పక్కపక్కనే నిలుచున్నారు. అయినా.. ఒకరి వైపు మరొకరు చూసుకోలేదు. కరచాలనం కూడా చేసుకోలేదు. దీన్ని బట్టి చూస్తే భారత్‌-చైనా సరిహద్దు వివాదాన్ని ఇద్దరూ మర్చిపోలేదని తెలుస్తోంది.

కీలక అంశాలపై చర్చ..

ఈ సదస్సులో ప్రాంతీయ భద్రతా సవాళ్లు, వ్యాపార-వాణిజ్యం, ఇంధన సరఫరా వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, తైవాన్‌ జలసంధిలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది. షాంఘైలో 2001లో ప్రారంభమైన ఎస్‌సీవోలో భారత్‌, చైనా, కజకిస్థాన్‌, కిర్గిజిస్థాన్‌, రష్యా, పాకిస్థాన్‌, తజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ సభ్య దేశాలు.

ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా భారత్‌..

భారత్‌ను ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఈ సదస్సులో ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచ జనాభాలో 40 శాతం ప్రజలు ఎస్‌సీవో సభ్య దేశాల్లోనే నివసిస్తున్నారని గుర్తు చేశారు. ప్రపంచ జీడీపీలో ఈ దేశాలదే 30 శాతం వాటా అని తెలిపారు. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఇంధనం, ఆహార సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలే కేంద్రంగా అభివృద్ధి విధానాన్ని అమలు చేయడంపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. భారత్‌లో ప్రస్తుతం 100కు పైగా యూనికార్న్‌లు, 70 వేలకు పైగా స్టార్టప్‌ కంపెనీలు ఉన్నాయని వివరించారు.