ఇండోనేషియాకు మోదీ.. జీ-20లో రిషి సునాక్‌తో భేటీ
ప్రధాని మోదీ సోమవారం ఇండోనేషియా వెళ్తున్నారు. మంగళ, బుధ వారాల్లో బాలీ ద్వీపంలో జరిగే జీ-20 సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సదస్సులో భాగంగా 10 మంది వివిధ దేశాల అధినేతలతోనూ మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తోనూ మోదీ భేటీ అవుతారని ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు తెలిపారు. జీ-20 సదస్సులో ఆహారం, ఇంధన భద్రత, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ హెల్త్ రంగాలపై విస్తృత చర్చ జరగనుందని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, పర్యావరణం, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి అంశాలపైనా చర్చలు జరుగుతాయన్నారు.

భారత్‌కు జీ-20 నిర్వహణ బాధ్యతలు..
జీ-20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రెంచ్ అధ్యక్షుడుఎమాన్యూయెల్ మైక్రాన్, జర్మనీ చాన్స్‌లర్ ఓలఫ్ ఫోల్జ్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తదితరులు పాల్గొంటారు. ఈ సమావేశాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పాల్గొనడం లేదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జీ-20 నిర్వహణ బాధ్యతలను ఇండోనేషియా నుంచి భారత్ డిసెంబర్ ఒకటవ తేదీన స్వీకరించనుంది. దీనికి సంబంధించిన లోగో, వెబ్‌సైట్‌ను ప్రధాని మోదీ ఇటీవల ఆవిష్కరించారు. బాలీ ద్వీపంలో 45 గంటల పాటు గడిపే ప్రధాని సదస్సు తర్వాత అక్కడి ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ పాల్గొంటారు.

