అమెరికాలో మోదీ మేనియా షురూ
భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అమెరికాలో మోదీ మేనియా ప్రారంభమయ్యింది. ప్రధాని మోదీ నేడు అమెరికా పర్యటనకు బయలుదేరారు.మోదీ రాకను పునస్కరించుకుని 20 నగరాలలో ఆహ్వాన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వాషింగ్టన్ డీసిలోని నేషనల్ మాన్యుమెంట్ నుండి లింకన్ మెమోరియల్ వరకూ ర్యాలీ నిర్వహించి ‘మోదీ మోదీ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. బుధవారం నుండి ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. అంతేకాదు రేపు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో జరిగే యోగా వేడుకలకు ఆయన నేతృత్వం వహించబోతున్నారు. వైట్ హౌస్‌ను కూడా సందర్శించి, అధ్యక్షుడు బైడన్ ఆతిధ్యాన్ని స్వీకరించబోతున్నారు.

అలాగే పర్యటనకు బయలుదేరేముందు ప్రఖ్యాత వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికక ఇచ్చిన ఇంటర్యూలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుందని, తాము తటస్థ వైఖరి అవలంబించడం లేదని, అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తున్నామని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో అనేక మార్లు చర్చలు జరిపామని, శాంతి స్థాపనకు భారత్ ఎంత చేయగలుగుతుందో అంతా చేస్తుందని తెలిపారు.