Home Page SliderNational

కర్నాటకలో హెలికాప్టర్ల తయారీ కేంద్రానికి మోదీ శంకుస్థాపన

కాంగ్రెస్ పార్టీపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన మోదీ
రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు సమయంలో కాంగ్రెస్ ఆరోపణలు
హెచ్ఏఎల్‌ను ఎత్తేసేందుకు మోదీ సర్కారు కుట్ర అంటూ విమర్శలు
తాజాగా హెలికాప్టర్ల ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన మోదీ
కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందంటూ మోదీ ధ్వజం
త్వరలో కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు

రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను ఎత్తేసేందుకు కుట్ర జరుగుతుందని నాడు కాంగ్రెస్ చేసిన ఆరోపణలు అవాస్తవాలని రుజువయ్యాయన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటకలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు అధికారిక కార్యక్రమంలో విపక్షాలను టార్గెట్ చేశారు. రాష్ట్ర రాజధాని బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమకూరులో భారతదేశపు అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ, రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌కు ప్రయోజనం చేకూరుస్తోందని, ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ మేజర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌ను నాశనం చేస్తోందని ప్రతిపక్షాల ఆరోపణలను ఉదహరించారు. “HAL (హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేశారు. మా ప్రభుత్వంపై చాలా తప్పుడు ఆరోపణలు చేశారు” అని పీఎం మోడీ కాంగ్రెస్ పేరు చెప్పకుండా దుయ్యబట్టారు.

“పార్లమెంటు పని గంటలను వృధా చేశారు. HAL హెలికాప్టర్ ఫ్యాక్టరీ, పెరుగుతున్న శక్తి, తప్పుడు ఆరోపణలు చేసిన వారిని బట్టబయలు చేస్తుంది. HAL రక్షణలో స్వావలంబనను పెంచుతోంది” అని మోదీ అన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలకు ఈ కర్మాగారం రుజువు కన్పిస్తోందన్నారు. ఫ్రెంచ్ సంస్థ నుండి రాఫెల్ విమానాల కొనుగోలుకు ₹ 59,000 కోట్ల ఒప్పందంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని రూపొందించింది. రాఫెల్ ఒప్పందం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌కు ప్రయోజనం చేకూర్చిందని ఆ పార్టీ ఆరోపించింది. యూపీఏ హయాంలో ఖరారు చేసినట్లుగా ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ మేజర్ హెచ్‌ఎఎల్ ప్రమేయం లేకుండా డీల్ ఎలా చేసుకుంటారని ప్రశ్నించింది. ప్రధాని మోదీ ప్రభుత్వం హెచ్‌ఏఎల్‌ను నాశనం చేస్తోందని, హెచ్‌ఏఎల్‌ నుంచి కాంట్రాక్టును తీసుకుని కర్నాటక ప్రజల నుంచి ఉద్యోగాలను లాక్కుంటోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. “చౌకీదార్ చోర్ హై (కాపలాదారు దొంగ)” ప్రచారంతో ప్రధానమంత్రిపై కాంగ్రెస్ దాడికి దిగింది.

ఈ రోజు ప్రారంభించబడిన గ్రీన్‌ఫీల్డ్ హెలికాప్టర్ ఫ్యాక్టరీ లైట్ యుటిలిటీ హెలికాప్టర్‌లను, ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్‌లను తయారు చేస్తుంది. ప్రారంభంలో, కర్మాగారం సంవత్సరానికి సుమారు 30 హెలికాప్టర్‌లను ఉత్పత్తి చేస్తుంది. దశలవారీగా 60 నుంచి 90కి పెంచుతారు. రాబోయే రెండు దశాబ్దాల్లో తుమకూరు ఫ్యాక్టరీ 1000 హెలికాప్టర్లను తయారు చేయనుంది. కొత్త కర్మాగారంతో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని… ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి ద్వారా 6,000 మందికి పైగా ప్రయోజనం పొందుతుందని భావిస్తున్నారు. 4 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. రాఫెల్‌ డీల్‌పై ప్రభుత్వానికి సుప్రీంకోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. నవంబర్ 2020లో, కాంగ్రెస్ పిటిషన్‌ను అనుసరించి, ఈ అంశంపై విచారణ ప్రారంభించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ సుప్రీం కోర్టు మునుపటి ఉత్తర్వులను ధృవీకరించింది. ఒప్పందంపై ప్రధాని మోదీపై చేసిన ఆరోపణలకు రాహుల్ గాంధీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.