మోదీ బడే భాయ్ అయితే రేవంత్ చోటీ భాయ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమాత్రం కృషి చేయలేదని ఆరోపించారు. కేటీఆర్ మాట్లాడుతూ, “తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బీజేపీకి చెరో 8 ఎంపీలను ఇచ్చారు. మొత్తం 16 మంది ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి ఉపయోగం చేకూరలేదు. రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచంలా మారిందని , ఆయన చేసే ప్రతి తప్పును బీజేపీ ఎంపీలు కాపాడుతున్నారు” అని అన్నారు.
అలాగే, కేంద్రంలో రేవంత్ రెడ్డి బావమరిదిని బీజేపీ కాపాడుతుంటే, రాష్ట్రంలో మాత్రం రేవంత్ ఒక బీజేపీ ఎంపీకి భారీ రోడ్డు కాంట్రాక్టులు ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ప్రధాని మోడీ, సీఎం రేవంత్ ఇద్దరూ ఒకే తాటిపై ఉన్నారని, “మోడీ బడే భాయ్ అయితే, రేవంత్ చోటీ భాయ్” అంటూ వ్యంగ్యాస్త్రాలు వదిలారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీని కూడా ఎద్దేవా చేస్తూ, మధ్యలో ఆయన అరటిపండు అయ్యారు. రాహుల్ భవిష్యత్తుకి రేవంత్ నుంచే ముప్పు ఉందని వ్యాఖ్యానించారు.
కేంద్రం, రాష్ట్రం రెండూ ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. “మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై ఈడీ దాడులు జరుగుతుంటే, రేవంత్ మాత్రం సీబీఐని ఉపయోగిస్తున్నాడు” అని విమర్శించారు.
ప్రస్తుతం రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారని, కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో నిలబడుతున్నారని అన్నారు. “గోదావరి నీళ్లు తెలంగాణకు వద్దంటున్న బీజేపీ నేతలు, ఆంధ్రా–తమిళనాడుకు మాత్రం ఇస్తామని చెబుతున్నారు” అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.