Andhra PradeshHome Page Slider

జగన్ సర్, ఎమ్మెల్సీ ప్లీజ్.. 175కి హెల్ప్ చేస్తాం

◆ పార్టీ పెద్దల వద్ద ఎమ్మెల్సీ కోసం నేతల కర్చీఫ్‌లు
◆ సీఎం జగన్ ను కలిసేందుకు ఆశావహుల విశ్వ ప్రయత్నాలు
◆ పదవులు ఆశించే వారితో కిటకిటలాడుతున్న వైసీపీ ఆఫీస్
◆ ఖాళీ కానున్న 23 ఎమ్మెల్సీ సీట్లలో 18 ఏకపక్షంగా వైసీపీకే

ఏపీలో ఈ సంవత్సరం 23 శాసనమండలి పదవులు ఖాళీ కానుండటంతో అందులో 90 శాతం స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. దీంతో వైసీపీలో ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావహులు తమ పొలిటికల్ గాడ్ ఫాదర్ లను ఆశ్రయిస్తున్నారు. తమకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించండి రానున్న ఎన్నికల్లో పార్టీ కోసం ఏమైనా చేస్తామని పార్టీ పెద్దల వద్ద కర్చీఫ్ వేస్తున్నారు. ఈ సంవత్సరం ఎమ్మెల్సీగా ఎన్నికైతే 2029 వరకు వారు ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉండటం 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆరేళ్లపాటు ఎమ్మెల్సీ పదవిలో కొనసాగవచ్చన్న భావనతో ఈ ఎమ్మెల్సీ పదవులకు భారీగా డిమాండ్ పెరిగింది. పలు జిల్లాల్లో సీనియర్ నాయకులు సైతం ఈ ఎమ్మెల్సీ పదవులకు విపరీతంగా పోటీపడుతున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర మంత్రులు పార్టీ పెద్దల వద్ద ఇప్పటికే తమ మనసులో మాట బయటపెట్టిన కొంతమంది ఆశావహులు సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి తమ శక్తివంచన లేకుండా ఎమ్మెల్సీ పదవి కోసం కృషి చేస్తున్నారు. సీఎం జగన్ అధికారంలో వచ్చినప్పటి నుండి సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పార్టీ పదవుల నుంచి మంత్రి పదవులు వరకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యస్తీకరణలో కూడా ఈ విషయం మరింత స్పష్టమైంది. 2024 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా నిర్ణయించిన జగన్ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇటీవల విజయవాడలో బీసీ సదస్సుని నిర్వహించి రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవులు భర్తీలో ఆచితూచి వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న ఆశావహులకు తనను కలిసే ఛాన్స్ కూడా జగన్ ఇవ్వటం లేదని అంటున్నారు.

జిల్లాల వారీగా సామాజిక సమీకరణాలను పార్టీ ముఖ్య నాయకులతో చర్చించి జగన్ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాలను ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలతో పాటు స్థానిక సంస్థల కోటాతో భర్తీ చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీలో 151 యొక్క స్థానాల్లో మూడోంతుల మెజార్టీ వైసీపీకి ఉంది. ఎమ్మెల్యే కోటాలో భర్తీ కావలసిన ఏడు స్థానాలు గవర్నర్ కోటాలో భర్తీ అయ్యే రెండు స్థానాలు వైసీపీ సొంతం అవుతాయి. స్థానిక సంస్థలు ఎన్నికల్లో సైతం ఫ్యాన్ స్పీడ్ ముందు ప్రతిపక్షాలు నిలవలేకపోయాయి. ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా పంచాయితీ నుంచి జిల్లా పరిషత్ వరకు వైసీపీ గెలిచి తిరుగులేని ఆధిపత్యంలో నిలిచింది. స్థానిక సంస్థల కోటాల భర్తీ కావలసిన తొమ్మిది స్థానాలు కూడా వైసీపీ ఖాతాలో పడనున్నాయి.

ఇక గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో భర్తీ కావలసిన 5 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ ఉత్కంఠ భరితంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పీడీఎఫ్ బలమైన పోటీ ఇస్తోందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఐదు స్థానాల్లో కనీసం రెండు స్థానాలు వైసీపీ దక్కించుకున్నట్లయితే 23 స్థానాలకు 20 ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ సొంతమవుతాయి. దీంతో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ పదవులను గెలిచేందుకు అధికార పార్టీ ఇప్పటినుంచి వ్యూహారచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక అంగ బలం ఉన్న అభ్యర్థుల్ని బరిలోకి దించడం ద్వారా సునాయాసంగా గెలవాలని యోచనలో ఆ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. 23 స్థానాలు భర్తీ అయ్యాక శాసనమండలిలో వైసీపీ బలమైన పక్షంగా మారనుంది. ఇప్పటివరకు శాసనమండలిలో కొనసాగిన టీడీపీ హవాకు చెక్ పడనుంది.