Home Page SliderTelangana

మూడో రోజు ఎమ్మెల్సీ కవిత విచారణ పూర్తి

ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత మూడో రోజు విచారణ పూర్తయ్యింది. దాదాపు 10 గంటలకు పైగా ఈడీ కవితను విచారించింది. విచారణ సందర్భంగా కవిత న్యాయవాది సోమ భరత్ ను సైతం ఈడీ పిలిపించింది. అయితే ఇవాళ ఉదయం విచారణకు హాజరయ్యే ముందుకు కవిత తాను గతంలో వాడిన ఫోన్లను మీడియాకు చూపించారు. కవిత పది ఫోన్లను ధ్వంసం చేశారంటూ ఈడీ ఆరోపిస్తుంటే.. తాను ఏ ఫోనూ కూడా ధ్వంసం చేయలేదని.. తనపై రాజకీయ కుట్రతోనే కేసు విచారణ జరుగుతోందని కవిత ఇవాళ ఆరోపించారు. ఈడీ అధికారికి లేఖ సైతం రాశారు.

అంతకు ముందు ఎమ్మెల్సీ కవిత ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు లేఖ రాశారు. ఫోన్ల ధ్వంసం ఆరోపణ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈడీ దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ… గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానన్నారు.

తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే. తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారన్నారు కవిత.

లిక్కర్ స్కామ్ విచారణ ద్వారా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును, మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగిందన్నారు. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరమని కవిత పేర్కొన్నారు.