Home Page SliderTelangana

ఈడీ విచారణకు హాజరుకాని ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ ముందుకు విచారణకు హాజరవుతారని అందరూ భావించారు. ఐతే ఆమె ఇవాళ విచారణకు హాజరుకాలేనని ఈడీకి లాయర్ ద్వారా సందేశం పంపించారు. విచారణ ప్రారంభం కావాల్సిన సమయంలో ఆమె ఈడీకి ఈమెయిల్ ద్వారా సందేశం పంపించారు. ఓవైపు అనారోగ్యం మరోవైపు సుప్రీం కోర్టులో కేసు విచారణ నేపథ్యంలో తాను విచారణకు రాలేనన్నారు. ఈడీ ఎప్పుడు పిలిచినా విచారణకు తాను హాజరవుతానన్నారు. ఈనెల 11న విచారణ సందర్భంగా ఈడీ అడిగిన పత్రాలను కవిత, లాయర్ భరత్ ద్వారా పంపించారు.

ఐతే, మొత్తం వ్యవహారంపై ఈడీ స్పందించాల్సి ఉంది. ఈనెల 11న విచారణ సందర్భంగా కవితను ఈడీ సుమారుగా 8 గంటలకు పైగా విచారించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి, కవిత నుంచి ఈడీ సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తోంది. ఐతే విచారణపై ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేసును తక్షణం విచారించాలని కోరినప్పటికీ అందుకు కవిత అభ్యర్థనను సీజే తిరస్కరించారు. కేసును ఈనెల 24న విచారిస్తానని ఆయన చెప్పారు. న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత కవిత, ఈడీకి లేఖ పంపినట్టు తెలుస్తోంది.