NewsTelangana

బీజేపీ నుంచి రాజాసింగ్‌ సస్పెన్షన్‌

బీజేపీ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్‌ సస్పెన్షన్‌కు గురి అయ్యారు. రాజాసింగ్‌పై హైకమాండ్‌ సీరియస్‌ అయింది. పార్టీ విధానాలను వ్యతిరేకంగా మాట్లాడినందుకు బీజేపీ నుండి సస్పెండ్‌ చేశామని హైకమాండ్‌ ఆదేశం జారీ చేసింది.. శాసనసభా పక్షనేత పదవి నుంచి కూడా రాజాసింగ్‌ను తొలగించారు. ఇప్పటికే రాజాసింగ్‌పై పలు ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో… సెప్టెంబర్‌ 2 లోపు వివరణ ఇవ్వాలని హైకమాండ్‌ కోరింది.

రాజాసింగ్‌ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు రావడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. అనుచిత వ్యాఖ్యలపై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే రాజాసింగ్‌కు ఇచ్చిన బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు బీజేపీ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంది. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పలు పీఎస్‌లో వరుస ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌ను షాహినాయత్‌ గంజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు సోషల్‌ మీడియాలో రాజాసింగ్‌ పెట్టిన వీడియోపై మజ్లిస్‌ ఆందోళనలు చేపట్టింది. దీంతో పోలీసులు యూట్యూబ్‌ నుండి ఆ వీడియోను డిలీట్‌ చేశారు.