Andhra PradeshHome Page Slider

ఎమ్మెల్యే కోటంరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు

నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వైయస్ కుటుంబంతో మొదట్నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రత్యేకించి వైయస్సార్సీపి ఆవిర్భావం నుంచి ఆయన జగన్ వెన్నంటే ఉన్నారు. ఈ నేపథ్యంలో 2014,2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని జగన్ ఆయనకు కల్పించారు. అధినేత ఇచ్చిన అవకాశాన్ని శ్రీధర్ రెడ్డి సద్వినియోగం చేసుకుంటూ నెల్లూరు రూరల్ లో వరుసగా రెండుసార్లు వైయస్సార్సీపి జెండాను రెపరెపలాడించారు. అలాగే ఆయన ప్రత్యేక కార్యక్రమాల పేరుతో నిరంతరం రూరల్ నియోజకవర్గం లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నియోజకవర్గ పరిధిలో పేద ప్రజలకు సొంత నిధులు వెచ్చించి వారి సమస్యలను పరిష్కరిస్తూ పనిచేసే శాసన సభ్యునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి కంటే ముందుగానే ఆయన నియోజకవర్గం పరిధిలోని ప్రతి గడపకు వెళ్లి పల్లెనిద్ర కూడా చేశారు. ఇలా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నియోజకవర్గం లో మరింత బలం పెరిగింది. ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తాయి.

నెల్లూరు సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి ప్రత్యేక వర్గంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల సిఎం జగన్ ను కలిసిన ఇరువురు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందే అధికారిక సమావేశంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారబోతున్నారంటూ అప్పట్లో జోరుగా ప్రచారం కూడా నడిచింది. తెలుగుదేశం పార్టీ జనసేన నేతలు ఆయనతో సమావేశం కూడా అయ్యారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. సీఎం జగన్ కోటంరెడ్డి శ్రీధర్ ను పిలిపించడంతో వివాదం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. అయితే ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆదివారం ఆయన మరో మారు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాపై నిఘా పెట్టారని నా సెల్ ఫోన్ ట్రాప్ చేశారని ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే పై ముగ్గురు అధికారులు నిగా పెట్టటం ఏమిటని ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన చేసిన ఆరోపణలు కొత్త చర్చకు కూడా తెర లేపాయి.