కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే..
కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నేడు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిసారు. చెరువులను కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలు చేపడుతున్న పలు కంపెనీలపై ఆయన ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీలకు అనుమతి ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే కొత్త నాటకాలకు తెర లేపిందన్నారు. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, రెరాలకు తన ఫిర్యాదును సమర్పించారు. ఐదు కంపెనీల పేర్లను ప్రస్తావిస్తూ తన కంప్లైటును ఇచ్చానని, వారిపై తగిన చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామన్నారు. ప్రజలు రియల్ ఎస్టేట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కష్టపడి సంపాదించిన సొమ్మును కబ్జాదారుల చేతుల్లో పెట్టొద్దని హెచ్చరించారు.

